సిద్దిపేట, ఆగస్టు 19 ( నమస్తేతెలంగాణ ప్రతినిధి): ఒకటో విడతలో రుణమాఫీ కాలే.. రెండోవిడతలో వస్తదనుకున్నారు.. అయినా రాలేదు. మూడో విడతలోనైన పేరు ఉంటుందని ఆశపడితే నిరాశే మిగిలిందని సిద్దిపేట జిల్లా గొల్లకుంట గ్రామ రైతులు గొల్లుమంటున్నారు. 2 లక్షల రుణమాఫీ చేశామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కొర్రీలు పెట్టి రైతులకు మొండిచేయి చూపుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలం గొల్లకుంట గ్రామాన్ని నమస్తే బృందం సందర్శించింది. గొల్లకుంటలో సుమారుగా 200 మందికి పైగా రైతు కుటుంబాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేసిందని సంబురపడ్డ రైతుల ఆశలకు ఆదిలోనే గండిపడ్డాయి. ఎక్కడ చూసినా రుణమాఫీ కాలేదని గ్రామ చావిడి వద్ద రైతులు ముచ్చటించుకుంటున్నారు. తొలి విడతలో లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తే కేవలం 71 మందికి, రెండో విడతలో 69 మందికి, మూడో విడతలో 35 మందికి రుణమాఫీ జరిగింది. ఈ చిన్న గ్రామంలో ఇంకా 35 మంది రైతులకు రుణమాఫీ కాలేదు. ఒక్క 200 మంది రైతులు ఉన్న ఒక గొల్లకుంటలోనే కాదు, మిగతా గ్రామాల్లోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. రుణమాఫీ కాని రైతులు వ్యవసాయ అధికారులు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. తక్షణమే గ్రామానికి అధికారులు వచ్చి రుణమాఫీ చేయాలని గ్రామ రైతులు కోరుతున్నారు.
నాకు మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది. అక్కన్నపేట గ్రామీణ బ్యాంకులో రెండేండ్ల కింద సుమారు 1.60 లక్షల వరకు రుణం తీసుకున్న. ఇప్పుడు రుణమాఫీ రెండు లక్షల వరకు మాఫీ అంటే బ్యాంకు పోయి అడిగిన. రుణమాఫీ కాలేదు అని చెప్పిండ్రు. చాలా బాధ అనిపించింది. రుణమాఫీ లేదు. ఏం లేదు. అంతా ఉత్తముచ్చట్ల లెక్కాగా మారింది. రుణమాఫీ గురించి ఎవరిని అడుగాలో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఈ నెల నుంచి బ్యాంకుల చుట్టు, అగ్రికల్చర్ ఆఫీసుల చుట్టు తిరుగుడే సరిపోతుంది.
నాకు రెండున్నర ఎకరాలు ఉంది. హుస్నాబాద్‌లోని కెనరా బ్యాంకులో 2018లో రుణం తీసుకున్న. రెగ్యులర్‌గా రెన్యువల్ చేయిస్తున్న. ప్రస్తుతం రూ. 1.32లక్షల రుణం ఉంది. నాకు రెండో విడతలో రుణమాఫీ కాలేదు. మూడో విడుతలో కూడా జరగలేదు. అగ్రికల్చర్ వాళ్లను అడిగితే అప్లికేషన్ ఇస్తే నాలుగో విడతల వస్తదనే ముచ్చట చెప్పుతున్నారు.
అక్కన్నపేట తెలంగాణ గ్రామీణ బ్యాంకులో మూడేండ్ల కిందట రూ. 60 వేలు లోను తీసుకున్నా. నా భర్త సమ్మయ్య కూడా ఇదే బ్యాంకులో రూ. 1.50 లక్షల రుణం తీసుకున్నడు. నాకు, నా భర్తకు ఎవరికీ రుణమాఫీ కాలేదు. మా తోటి కోడ లు, మరిది కూడా బ్యాంకులో రుణాలు తీసుకున్నారు. అసలు మొత్తం మా కుటుంబానికే రుణమాఫీ కాలేదు.