Annaram Barrage | వరంగల్, జనవరి 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణలో సాగు, తాగునీటికి ప్రాణాధారంగా నిలిచేలా గత కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు స్ఫూర్తిని కాంగ్రెస్ అపహాస్యం చేస్తున్నది. ప్రాజెక్టును కాపాడి పంటలకు నీళ్లివ్వాల్సింది పోయి.. ఒక్క పిల్లర్ కుంగితే మొత్తం ప్రాజెక్టే వ్యర్థమని తప్పుడు ప్రచారం చేసి ఇప్పుడు దాని ఉనికినే ప్రశ్నార్థకం చేసింది. మొన్నటి వానకాలంలో బరాజ్‌లలో నీటిని నిల్వ చేయాల్సింది పోయి మొత్తం గేట్లు ఎత్తేసి వందలాది టీఎంసీల నీటిని దిగువకు వదిలేసింది. ఏకంగా గోదావరిని ఎండబెట్టి ఇప్పుడు అందులో ఇసుక వ్యాపారం యథేచ్ఛగా నడిపిస్తున్నది. ప్రభుత్వ ఆధ్వర్యంలో గోదావరిలో ఇసుక తవ్వకాలు ఎప్పటి నుంచో ఉన్నా ప్రస్తుత ప్రభుత్వం వింతగా వ్యవహరిస్తున్నది. ప్రజలకు తాగు, సాగునీటిని అందించాలన్న సోయిని గాలికొదిలి అధికార పార్టీలోని కొందరి ఆర్థిక ప్రయోజనాల కోసం ఇసుక బిజినెస్ కోసం ‘గేట్లు’ ఎత్తింది. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన అన్నారం బరాజ్‌కు సమీపంలోనే దిగువన ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అన్నారం బరాజ్ దిగువన కొత్తగా మొదలు పెట్టిన ప్రభుత్వ క్వారీ నుంచి రోజూ 200 లారీల్లో 10 వేల టన్నుల ఇసుక రవాణా అవుతున్నది. గోదావరిలో ఇసుక తవ్వి బయట పోసిన తర్వాత లారీల్లో లోడింగ్ చేసే విధానాన్ని పక్కన బెట్టి, బరాజ్‌కు సమీపంలోనే రోజూ వందల లారీల్లో ఇసుక లోడింగ్ చేస్తున్నది. భవిష్యత్తులో బరాజ్‌కు ముప్పు వాటిల్లేలా ఇసుక తవ్వకాలు చేపట్టడం కాంగ్రెస్ కుట్ర ఉన్నదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బరాజ్ పక్క నుంచి తాత్కాలికంగా రోడ్డు వేసి వందల లారీల రాకపోకలు సాగిస్తున్నాయి. బరాజ్ సమీపంలోనే ఇసుక తవ్వడం వల్ల పిల్లర్లకు ప్రమాదం వాటిల్లే పరిస్థితి ఉన్నది. గ్రావిటీ కెనాల్‌పై నుంచి భారీ లోడ్ వాహనాలు రాకపోకలు సాగించొద్దనే సూచనలను పట్టించుకోవడంలేదు. టన్నుల కొద్దీ ఇసుక లోడింగ్ చేసుకుంటున్న వందలాది లారీలు ఈ దారిలోనే పోతున్నాయి.
సహజ వనరు ఇసుకను అధికార పార్టీ నేతలు అక్రమ ఆదాయ వనరుగా చేసుకున్నారు. గోదావరిపై ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇసుక క్వారీల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్వారీలో ఇసుక తవ్వకాలు, లోడింగ్ కాంట్రాక్టర్లు అంతా అధికార పార్టీ నేతలే ఉంటున్నారు. వీరి ఆధ్వర్యంలోనే ఇసుక వ్యా పారం, రవాణా జరుగుతున్నది. ప్రభుత్వ నిబంధనలు ఎక్కడా పాటించడంలేదని తెలుస్తున్నది. అధికార నేత లు నిబంధనలను ఉల్లంఘించి సర్కారుకు రా వాల్సిన ఆదాయాన్ని సొంతం చేసుకుంటున్నా రు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రస్తు తం మూడు క్వారీల నుంచి రోజూ సగటున 400 లారీల్లో ఇసుక రవాణా అవుతున్నది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నల్లగొండ ఉమ్మడి జిల్లాల్లో ఈ ఇసుక వినియోగం ఎక్కువగా ఉంటున్నది. ఇదే అదనుగా అధికార పార్టీ నేతలు పరిమితికి మంచి ఇసుక రవాణా చేస్తున్నారు. లారీల యజమానులు ప్రభుత్వానికి చెల్లించిన డీడీ కంటే ఎ క్కువ మొత్తంలో ఇసుక లోడింగ్ చేస్తున్నారు. లోడింగ్ సమయంలో ప్రొైక్లెన్తో అక్రమంగా, అదనంగా 10 టన్నుల వరకు లోడింగ్ చేస్తున్నారు. ప్రొైక్లెన్ ఒక్కో బకెట్‌కు 5 టన్నుల ఇసు క లోడ్ అవుతుంది. ప్రతి లారీలోనూ రెండు బకెట్లను అక్రమంగా నింపుతున్నారు. ఇలా ఒ క్క లారీ లో లోడింగ్ చేస్తున్న ఇసుక విలువ మార్కెట్లో రూ.7700 వరకు ఉంటున్నది. ఇ లా రోజూ రూ.30.80లక్షల విలువగల ఇసుక అక్రమ వ్యాపారం జరుగుతున్నది. క్వారీల్లో ఇసుక లోడింగ్, కాంటా ప్రక్రియను పర్యవేక్షించాల్సిన తెలంగాణ స్టేట్ మైనింగ్ డెవలప్మెం ట్ కార్పొరేషన్ అధికారులు అక్రమాలకు సహకరిస్తున్నారన్న విమర్శలున్నాయి. లారీల లోడింగ్ పరిమాణంపై తనిఖీలు చేయాల్సిన విజిలెన్స్ అధికారులు మొక్కుబడిగా ఎప్పుడో ఒకరోజు పట్టుకుంటున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గోదావరి నదిపై ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న క్వారీల్లోనే ఇసుక అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతున్నది. మహదేవపూర్ మండలం అ న్నారం క్వారీ నుంచి రోజూ 200 లారీల్లో 10 వేల టన్నుల ఇసుక రవాణా అవుతున్నది. కా ళేశ్వరం సమీపంలోని పలుగుల రెండు క్వారీల నుంచి రోజూ సగటున 50 లారీల్లో 2 వేల ట న్నులు, విలాసాగర్ క్వారీ నుంచి 40 లారీల్లో 2 వేల టన్నులు, అంబట్పల్లి మూడు క్వారీల నుంచి 50 లారీల్లో రోజూ 2 వేల టన్నులు, కుంట్లం క్వారీ నుంచి 30 లారీల్లో రోజూ 1500 టన్నుల ఇసుక రవాణా అవుతున్నది. అన్నారం క్వారీ నుంచి పెద్దమొత్తంలో ఇసుక వస్తుండగా ఈ క్వారీ నుంచే జీరో దందా జో రుగా సాగుతున్నట్లు ఆరోపణలున్నాయి. అధికార పార్టీలోని ఓ కీలక ప్రజాప్రతినిధికి మహదేవపూర్ మండలంలో దగ్గరగా ఉండే ఇద్దరు అధికార పార్టీ నేతల ఆధ్వర్యంలోనే ఈ క్వారీ ల నుంచి ఇసుక రవాణా జరుగుతున్నది. ము లుగు జిల్లాలోనూ ఇసుక అక్రమ రవాణాకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. వెంకటాపురం(నూగురు) మండలంలో 23 క్వారీలు రాష్ట్ర ప్రభుత్వంలోని ఇద్దరు కీలక ప్రజాపతినిధుల ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. మంగపేట మండలంలోని 7 క్వారీలు రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న ఇద్దరు కీలక నేతల భాగస్వామ్యంలో నడుస్తున్నాయి.
ప్రభుత్వ క్వారీలతో సంబంధం లేకుండా అటవీ ప్రాంతాల్లోని వాగుల నుంచి కూడా భారీగా ఇసుక అక్రమ రవాణా అవుతున్నది. మల్హర్ మండల సరిహద్దులో ఉన్న మానేరు వాగులోంచి తీసి నిల్వ చేసిన ఇసుకను అక్రమార్కులు అధిక ధరలకు విక్రయిస్తూ పెద్దపల్లి వైపు తరలిస్తున్నారు. భూపాలపల్లి మండలం దూదేకులపల్లి పెద్దవాగు, బొగ్గులవాగు, కాశీంపల్లి చెలిమెలవాగు, తీగెలవాగు, మోరంచపల్లి వాగు, గద్దెకుంటవాగు, చిట్యాల మండలం కాల్వపల్లి వాగు ప్రాంతాల నుంచి ఇసుక అ క్రమ రవాణా సాగుతున్నది. ఇక్కడి నుంచి ఇసుకను ట్రాక్టర్లలో రవాణా చేస్తున్నారు. అట వీ ప్రాంతం కావడంతో వీరిని అడ్డుకునే వారు ఎవరూ ఉండడంలేదు. ఇసుక అక్రమ రవా ణా చేస్తున్న ట్రాక్టర్ల నుంచి అటవీ శాఖ అధికారులకు ప్రతి నెలా మామూళ్లు అందుతున్నట్టు విమర్శలున్నాయి. ట్రాక్టర్ల యజమానులు ఒ క్కో ట్రాక్టరుకు ప్రతి నెల రూ.10 వేల చొప్పు న అటవీ శాఖ అధికారులకు ముట్టజెప్తున్నట్టు తెలుస్తున్నది. భూపాలపల్లిలో 150 ట్రాక్టర్లు ఇసుక రవాణాలోనే ఉంటున్నాయి. చిట్యాల మండలం కాల్వపల్లి వాగు నుంచి ఇసుక భూ పాలపల్లి పట్టణానికి జోరుగా తరలుతున్నది. టేకుమట్ల సమీప మానేరు వాగు నుంచి రాత్రిపూట ఇసుక రవాణా చేస్తున్నారు. చిట్యాల, టేకుమట్ల మండలాల్లో అధికార పార్టీకి చెందిన మండల స్థాయి మాజీ ప్రజాప్రతినిధి ఇసుక వ్యాపారంలో కీలకంగా ఉన్నారు.