Congress | జయశంకర్ భూపాలపల్లి, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): అసైన్డ్ భూమిలో అక్రమార్కులు నిర్మాణాలు చేపట్టడంతోపాటు ఏకంగా పట్టా పాస్ పుస్తకాలు పొందారు. ఇలా రూ.20 కోట్ల విలువ చేసే రెండెకరాల అసైన్డ్ భూమిని కాజేసేందుకు పక్కాప్లాన్ వేసుకున్నారు. రెవెన్యూ అధికారులు అడ్డుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పక్కనే ఓ అధికార పార్టీ నేత ఏకంగా 20 గుంటల అసైన్డ్ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకొని జీవో 59 కింద రెగ్యులరైజ్ చేయాలని దరఖాస్తు చేసుకోవడమే కాకుండా షెడ్లు కూడా నిర్మించాడు. వీటి జోలికి మాత్రం అధికారులు వెళ్లడం లేదు. వివరాల్లోకి వెళ్తే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారి పక్కనే 170 సర్వే నంబర్లో 14 మంది దళిత పేద రైతులకు ఆరెకరాల అసైన్డ్ భూమిని 1975లో ప్రభుత్వం కేటాయించింది. చాలా మంది విక్రయించ డంతో ప్రభుత్వం వారి హక్కు పత్రాలు రద్దు చేసింది.
దీనిలో అక్రమంగా నిర్మాణా లు చేపట్టడంతో అధికారులు ఇండ్లకు తాళా లు వేశారు. వారు కోర్టుకు వెళ్లడంతో నిర్మాణాలను అధికారులు తొలిగించలేకపోయా రు. అప్పటి నుంచి స్తబ్దుగా ఉన్న ఈ భూ మిలో ప్రస్తుతం మళ్లీ అక్రమ నిర్మాణాలు మొదలయ్యాయి. నలుగురు వ్యక్తులు తమ కు 1975లో ప్రభుత్వం సాగు హక్కు పత్రా లు ఇచ్చిందని, తహసీల్దార్ పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చారని సోమవారం రూ.2 కోట్ల విలువైన రెండెకరాల భూమిని చదును చేసి గది నిర్మాణం చేపట్టారు. రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసి పనులు అడ్డుకున్నారు. 20 ఏండ్లకు పైగా సాగులోలేని అసైన్డ్ భూమికి పట్టా పాస్ పుస్తకాలు ఎలా జారీ అయ్యాయని, మున్సిపల్ స్థలంలో అనుమతులు లేకుండా ఎలా
నిర్మాణాలు చేపట్టారని రెవెన్యూ అధికారులు ప్రశ్నించారు.
ఆ రేకుల షెడ్ల జోలికి వెళ్లని అధికారులు
170 సర్వే నంబర్లోని 20 గుంటల అసైన్డ్ భూమిలో ఓ అధికార పార్టీ నేత పాగా వేశారు. క్రయ విక్రయాలకు వీలు లేని అసైన్డ్ భూమిని కొనుగోలు చేశానని సదరు నేత ఏకంగా రిజిస్ర్టేషన్ చేయించుకున్నాడు. అంతటితో ఆగకుండా 59 జీవో కింద రెగ్యులరైజ్ చేయాలంటూ దరఖాస్తు చేసుకుని రూ.10 లక్షలు డీడీ తీశాడు. అధికారులు అతడి దరఖాస్తును తిరస్కరించినా ఆ స్థలంలో షెడ్లు నిర్మించాడు. దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అధికార పార్టీ నేత కావడంతోనే చర్యలకు అధికారులు వెనుకాడుతున్నారనే ఆరోపణలున్నాయి.
మాకు పట్టా ఇచ్చారు
170/3/1 సర్వే నంబర్లోని అసైన్డ్ భూమిలో 1975లో 14 మందికి 20 గుంటల చొప్పున హక్కు పత్రాలు ఇచ్చారు. పాస్ పుస్తకాలున్న నలుగురికి చెందిన 2 ఎకరాలను చదును చేస్తుండగా అధికారులు అడ్డుకుంటున్నారు. – మోరె వెంకటయ్య
విచారణ జరుపుతున్నాం
170 సర్వే నంబర్లోని అసైన్డ్ భూమికి పట్టాలు ఎలా వచ్చాయనే విషయమై విచారణ జరుపుతున్నాం. ఇదే సర్వే నంబర్లో మరొకరు రిజిస్ర్టేషన్ చేసుకొని 59 జీవో కింద రెగ్యులరైజ్‌కు దరఖాస్తు చేసుకోగా తిరస్కరించాం.
– శ్రీనివాసులు, తహసీల్దార్