దక్షిణమధ్య రైల్వే ఇంచార్జి జీఎం అరుణ్‌కుమార్ జైన్ వెల్లడి
జడ్చర్లటౌన్/బాలానగర్, జూలై 27: ఆర్యూబీల వద్ద సమస్యల పరిష్కారానికి అన్ని విధాలా చర్యలు చేపడుతున్నట్టు దక్షిణ మధ్యరైల్వే ఇంచార్జి జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ తెలిపారు. బుధవారం ఆయన డీఆర్ఎం శరత్చంద్రయాన్ తో కలిసి మహబూబ్‌నగర్, జడ్చర్ల, బాలానగర్ రైల్వేస్టేషన్లను సందర్శించారు. జడ్చర్ల రైల్వేస్టేషన్‌లోని గూడ్స్ ప్లాట్ఫారం వద్ద పనులను పరిశీలించారు. రైల్వే హమాలీ సంఘం భవనాన్ని పరిశీలించిన తరువాత అక్కడే మొక్కలు నాటారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల మహబూబ్‌నగర్ సమీపంలోని ఆర్యూబీ వద్ద వరద నీటిలో స్కూల్ బస్సు ఇరుక్కుపోయిన ఘటనపై ఆయన స్పందిస్తూ.. రైల్వే ఇంట్రా పను లు పూర్తయ్యేవరకు కొన్ని సమస్యలు తప్పవన్నా రు. మహబూబ్‌నగర్-కర్నూల్ మధ్య జరుగుతున్న రైల్వే పనులు పూర్తికాగానే అన్ని ఎలక్ట్రిక్ రైళ్ల రాకపోకలను పెంచుతామన్నారు. 25 వేల మంది ప్రయాణికులు రాకపోకలు కొనసాగించే రైల్వే స్టేషన్లలో ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులు రైల్వే ప్లాట్‌ఫాం లు దాటేందుకు లిఫ్ట్‌లు ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు. జడ్చర్ల రైల్వేగేటు వద్ద ఆర్యూబీ నిర్మాణానికి అనుమతి లభించిందని, తొందరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. అన్ని రైళ్లు జడ్చర్లలో ఆపాలని, ఆర్యూబీ పనులను తొందరగా చేపట్టి సమస్యను పరిష్కరించాలని అంతకుముందు వివిధ పార్టీల నాయకులు రైల్వే జీఎంకు వినతిపత్రం సమర్పించారు.