TGSRTC | హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తేతెలంగాణ) : ఆర్టీసీలో సర్వీస్ రిమూవల్ అయిన కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏర్పాటుచేసిన త్రిసభ్య కమిటీ కార్మికుల్లో రచ్చ లేపింది. కమిటీలో తమకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఇద్దరు ఐఏఎస్‌లు, ఒక ఐపీఎస్‌తో ఏర్పాటుచేసిన కమిటీతో తమకు ఏం న్యాయం జరుగుతుందని కార్మికులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్ గుర్తింపు లేకపోవడంతో యూనియన్లకు బస్‌భవన్‌లోకి ఎంట్రీ లేదని, తమ సమస్యలు పరిష్కారం కావట్లేదని వాపోతున్నారు. త్రిసభ్య కమిటీ ఏర్పాటై 15 రోజులు అవుతున్నా.. ఇప్పటికీ కార్మికుల సర్వీస్ వివాదాలపై ఎలాంటి సమావేశాలు నిర్వహించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కమిటీలో సంఘాలకు అవకాశం ఏది?
ఆర్టీసీలో చివరిసారిగా 2016లో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి. తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ) గెలుపొందగా, రెండేండ్ల కాలపరిమితి ముగిసిన తర్వాత మళ్లీ ఎన్నికలు జరగలేదు. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చాక ట్రేడ్ యూనియన్‌కు గుర్తింపు వస్తుందని భావించినా అది నెరవేరలేదు. ఈక్రమంలో వివిధ కారణాలతో ఉద్యోగం నుంచి తొలగించబడిన కార్మికులు తమకు తిరిగి ఉద్యోగం ఇవ్వాలని సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, అధికారుల చుట్టూ తిరుగుతుండటంతో.. సమస్య పరిష్కారానికి కార్మికశాఖ ముఖ్యకార్యదర్శి సంజయ్‌కుమార్ చైర్మన్‌గా త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేస్తూ సర్కారు డిసెంబర్ 11న జీవో తీసుకొచ్చింది. ఈ కమిటీలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, సెర్ప్ సీఈవో దివ్య సభ్యులుగా ఉన్నారు. యూనియన్ల నుంచి మాత్రం అవకాశం ఇవ్వలేదు.
కార్మికుల పొట్ట కొడుతున్నరు..
యాక్సిడెంట్లు, టికెట్ల జారీలో పొరపాట్లు, బ్రీత్ అనలైజర్ కేసుల్లో దాదాపు 300 మందికిపైగా ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో చిన్న చిన్న తప్పులకే ఉద్యోగాల నుంచి తొలగించి తమ పొట్ట కొడుతున్నారని కార్మికులు వాపోతున్నారు. తమకు తిరిగి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. త్రిసభ్య కమిటీలో యూనియన్ల నుంచి అవకాశం కల్పించాలని జాక్ కన్వీనర్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ థామస్‌రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. కార్మికులపై వేధింపులు పెరిగాయని, ఎక్కువ గంటలు పని చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు.