హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీకి ‘మహాలక్ష్మి పథకం.. ఉచిత బస్సు ప్రయాణం’ నిధులు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వంతో భారీగా బకాయిలు పేరుకుపోతున్నాయి. వేల కోట్ల రూపాయిలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉన్నా.. ప్రజా రవాణాను నిర్లక్ష్యం చేస్తుండటంతో సంస్థ ఉద్యోగులకు జీతాలు కూడా సరిగా ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీకి ఒక్క మహాలక్ష్మి పథకం కింద ఇవ్వాల్సిన బకాయిలే సుమారు రూ.1350 కోట్లు ఉన్నట్టు తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టిన నాటి నుంచి ప్రతినెలా ఎంతోకొంత (కనీసం రూ.10కోట్లు) డబ్బులు పెండింగ్ పెడుతుండటంతో ఇవ్వాల్సిన డబ్బులు భారీగా పేరుకుపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, సిటీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కింద నెలకు సుమారు రూ.310 కోట్ల-రూ.350 కోట్ల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇటీవల ఆర్టీసీ సమస్యలపై గళమెత్తిన బీఆర్ఎస్ నేతలు ప్రజారవాణా సంస్థను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహాలక్ష్మి పథకం కింద ఇవ్వాల్సిన బకాయిలతోపాటు, ప్రభుత్వం తరపున ఆర్టీసీ ఇస్తున్న రాయితీలు మొత్తం కలిపి నెలకు కనీసం రూ.500 కోట్లు ఇవ్వాలని కోరారు.
80శాతం ఉచిత ప్రయాణాలే!
ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌లలో ఒక్కో బస్సులో సుమారు 80శాతం వరకు ఉచిత ప్రయాణాల టిక్కెట్లే ఉంటున్నాయని కండక్టర్లు చెప్తున్నారు. 20శాతం మాత్రమే ప్రయాణిస్తున్న పురుషుల టికెట్ల ద్వారా డబ్బులు వస్తున్నాయని అంటున్నారు. దీంతో ఆర్టీసీకి రోజూ ప్రత్యక్షంగా వచ్చే నగదు భారీగా తగ్గిపోయిందని వాపోతున్నారు. జీరో టికెట్లకు లెక్కకట్టి ప్రతినెలా నిధులు ఇవ్వాల్సిన ప్రభుత్వం.. ఆర్థిక ఇబ్బందులను కారణంగా చూపుతూ దాటవేస్తున్నది. దీంతో ఉద్యోగులు, కార్మికులకు జీతాలు ఇచ్చేందుకు ప్రతినెలా 20వ తేదీ నుంచే సచివాలయంలోని ఉన్నతాధికారుల చుట్టూ తిరగాల్సి వస్తున్నదని ఆర్టీసీ ఉన్నతాధికారులు చెప్తున్నారు. 10రోజులు ముందు నుంచి చెప్తేగానీ ఒకటో తారీఖున వేతనాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నదని వివరిస్తున్నారు. ఇవ్వాల్సిన డబ్బుల్లోనూ ప్రభుత్వం కోత విధిస్తుండటంతో ఆ లోటును పూడ్చలేక సతమతవుతున్నామని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. మహిళా ప్రయాణికులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం రీయింబర్స్ ఇవ్వడానికి ప్రత్యేకంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కార్మిక సంఘాల నేతలు కోరుతున్నాయి. జీరో టిక్కెట్ ఎర్నింగ్స్‌ను కూడా చార్జీ టికెట్ ఎర్నింగ్స్ కింద పరిగణించాలని సూచిస్తున్నారు. చార్జీతో కూడిన టికెట్ ఎర్నింగ్స్ పెంచాలని కండక్టర్లపై, కేఎంపీఎల్ పెంచాలని డ్రైవర్లపై వేధింపులు అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇతర రాయితీల బాకీ రూ.700 కోట్లు
వివిధ వర్గాలకు ఇస్తున్న బస్‌పాస్ రాయితీల డబ్బులు ప్రభుత్వం వందల కోట్లలో ఆర్టీసీకి చెల్లించాల్సి ఉంది. 25 లక్షల మంది విద్యార్థులు, జర్నలిస్టులు, దివ్యాంగులు, ఇతరులు కలిపి మొత్తం 31 లక్షల మందికి ఇస్తున్న బస్‌పాస్ రాయితీలను ప్రభుత్వం తక్షణం చెల్లించాలని కార్మికులు కోరుతున్నారు. కాగా ఈ బాకీ మొత్తం సుమారు రూ.700 కోట్లు వరకు ఉంటుందని ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. వాటిని ప్రభుత్వం నుంచి రాబట్టే విషయంలో యాజమాన్యం కూడా మెతక ధోరణి అవలంబిస్తున్నదని ఆర్టీసీ యూనియన్ల నేతలు అంటున్నారు. పెరిగిన ప్రయాణికులకు అనుగుణంగా బస్సులు పెంచడం లేదని, కొత్త బస్సుల కొనుగోలులో తాత్సారం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఆర్టీసీ విస్తరణ కోసం కృషి చేయాల్సిన ప్రభుత్వం.. సంస్థ ఆస్తులను, డిపోలను, వర్క్‌షాపులను, కార్గో వ్యవస్థను వరుసగా ప్రైవేట్ పరం చేస్తుండం దారుణమని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఆర్టీసీ ఆదాయానికి గండికొడుతున్న ప్రైవేట్ అక్రమ వాహనాలను కట్టడి చేయాలని, ఆర్టీఏ అధికారులు రోజూ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆర్టీసీ యూనియన్ల నేతలు కోరుతున్నారు.