TGSRTC | హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 22 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. 27న ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇవ్వబోతున్నట్టు కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఎంప్లాయీస్ యూనియన్ కేంద్ర కార్యాలయంలో బుధవారం రాష్ట్ర జేఏసీ నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ వెంకన్న, వైస్ చైర్మన్ థామస్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్నా ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, ట్రేడ్ యూనియన్లపై ఆంక్షల ఎత్తివేత, 2021 నుంచి వేతన సవరణ హామీలు నెరవేర్చలేదని పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రయివేట్ పరం చేయడానికి సర్కార్ కుట్ర పన్నుతుందని విమర్శించారు.
ప్రయివేట్ బస్సులతో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని వాపోయారు. ప్రభుత్వానికి పర్యావరణంపై ప్రేమ ఉంటే ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీకి కొనుగోలుచేసివ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఆర్టీసీ జీతాలు ఉండాలని కోరారు. వీటిన్నింటిపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో సమ్మె బాటకు సిద్ధమైనట్టు పేర్కొన్నారు. కాంగ్రెస్ సర్కార్‌కు బుద్ధి చెప్పడానికి అన్ని జిల్లాల్లో నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ కుట్రలను ప్రజా క్షేత్రంలో ఎండగడుతామని హెచ్చరించారు. రేపు, ఎల్లుండి నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేస్తామని తెలిపారు.