హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ)/హిమాయత్‌నగర్: ఆర్టీసీ పరిరక్షణ, ప్రభుత్వంలో విలీనం, కార్మికుల సమస్యల పరిష్కారం, కాంగ్రెస్ ఎన్నికల హామీల అమలు డిమాండ్లతో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ సమ్మెకు సిద్ధమైంది. జనవరి 27న నోటీసు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన కరువైందని, సమ్మెకు పోవాల్సిందేనని తేల్చిచెప్పింది. సమ్మెకు సంబంధించిన వివరణను లేబర్ కమిషనర్ ఆఫీసులో అధికారులకు మరోసారి అందజేశారు. హిమాయత్‌నగర్‌లోని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయంలో ఆర్టీసీ జేఏసీ నేతలు రౌండ్‌టేబు ల్ సమావేశం నిర్వహించి, సమ్మె పోస్టర్లను ఆవిష్కరించారు. మే 1న అన్ని డిపోల్లో మేడే జెండాను ఎగురవేసి, మే 5న కార్మిక కవాతు నిర్వహించి, 7నుంచి సమ్మెకు సన్నద్ధం కావాలని కార్మికులకు జేఏసీ పిలుపునిచ్చింది. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం భేషజాలు వీడి, కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న కోరారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు సమ్మె కొనసాగుతుందని జేఏసీ వైస్ చైర్మన్ థామస్‌రెడ్డి స్పష్టంచేశారు. కొన్ని సంఘాలు జేఏసీలోకి వస్తామని చెప్తూనే యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. కార్యక్రమంలో జేఏసీ కో-చైర్మన్ హన్మంతు, కన్వీనర్ మౌలానా, కో-కన్వీనర్లు యాదయ్య, సురేశ్, యాదగిరి, ఏఐటీయూసీ రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి నరసింహ, జాతీయ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం ; అనారోగ్యం కారణంగా సెలవు ఇవ్వకపోవడంతో మనస్తాపం
బాన్సువాడ, ఏప్రిల్ 29 :బాన్సువాడ ఆర్టీసీ డిపోకు చెందిన ఓ డ్రైవర్ ఆత్మహత్యకు యత్నించాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డ్రైవర్ గంగాధర్ తనకు సెలవు పొడిగించాలని కోరేందుకు మంగళవారం డిపోకు వచ్చాడు. అధికారులు పట్టించుకోకపోవడంతో బయటకు వెళ్లి గడ్డి మందు తాగాడు. అనంతరం డిపోకు వచ్చిన అతడు తోటి సిబ్బందితో మాట్లాడుతుండగా స్పృహ తప్పి పడిపోయాడు. వారు వెంటనే దవాఖానకు తరలించారు. అనారోగ్యం కారణంగా గంగాధర్ నాలుగు రోజులుగా సెలవులో ఉన్నాడు. ఆరోగ్యం కుదుటపడకపోవడంతో డిపోకు వచ్చి సెలువు గురించి విన్నవించగా, డీఎం పట్టించుకోకుండా కారులో వెళ్లిపోయిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం గంగాధర్ కోలుకుంటున్నట్టు తోటి ఉద్యోగులు పేర్కొన్నారు.