RTC Employees | హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో ఉద్యోగులు తీవ్ర పనిఒత్తిడికి గురవుతున్నారు. ఒకవైపు పనిఒత్తిడి, డబుల్ డ్యూటీలు.. మరోవైపు అనారోగ్య సమస్యలు, అధికారుల వేధింపులతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. పల్లెవెలుగు బస్సుల్లో ప్రయాణికుల సామర్థ్యం 50 మంది వరకు ఉంటుంది. గతంలో అదనంగా 10 నుంచి 20 మంది వరకు ప్రయాణం చేసేవారు. ప్రస్తుతం పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో 80 నుంచి 100 మంది వరకు ప్రయాణం చేస్తున్నారు. ఏ బస్సు చూసినా ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నది. అంతమందికి టికెట్లు ఇచ్చి అలసిపోతున్నారు. మరోవైపు, బస్సులో ఖాళీ లేక వృద్ధులు, చిన్న పిల్లలు అవస్థలు పడుతున్నారు. ఆర్టీసీ డ్రైవర్లు కేఎంపీఎల్ తీసుకురాకపోతే పైఅధికారులు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. కేఎంపీఎల్ ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నారు. కండక్టర్లకు టికెట్ల టార్గెట్ నిర్దేశిస్తున్నట్టు ఆర్టీసీలో చర్చ జరుగుతున్నది. టార్గెట్ రాకపోతే తాము ఏం చేయగలం అంటూ వారు వాపోతున్నారు.
ఇష్టారాజ్యంగా డ్యూటీలు
డ్రైవర్లు, కండక్టర్లకు గతంలో 8 గంటల డ్యూటీ ఉండేది. కానీ ఇప్పుడు పని గంటల నిబంధన లేదు. సుదూర ప్రాంతాలకు వెళ్లిన డ్రైవర్లు, కండక్టర్లు డే డ్యూటీ చేస్తారు. కానీ ఉదయం వెళ్లిన వారు ట్రాఫిక్ ఇబ్బందులతో తిరిగి వచ్చే సరికి రాత్రి అవుతుంది. నిజామాబాద్-హైదరాబాద్ మధ్య అప్ అండ్ డౌన్ 360 కిలోమీటర్లు, నిజామాబాద్-వరంగల్ మధ్య అప్ అండ్ డౌన్ 460 కిలోమీటర్లు, హైదరాబాద్-ఖమ్మం అప్ అండ్ డౌన్ 400 కిలోమీటర్లు. దీంతో వారికి టార్గెట్ ఒత్తిడి కూడా ఉంటుంది. దీంతో కార్మికులకు పనిభారం పెరుగుతున్నది. డ్రైవర్లు, కండక్టర్లు నిత్యం 10 నుంచి 12 గంటల పాటు పనిచేస్తున్నారు. దీంతో నిద్ర కరువై అనారోగ్యాలబారిన పడుతున్నారు. నిద్రలేమి వల్ల కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి.
డబుల్ డ్యూటీ చేస్తేనే సెలవులు
ఆర్టీసీ ఉద్యోగులు సెలవులు తీసుకోవాలంటే కూడా ఇబ్బందులు తప్పటం లేదు. కండక్టర్, డ్రైవర్లకు డే డ్యూటీ, నైట్ డ్యూటీ, స్పెషల్ డ్యూటీ ఉంటుంది. రోజంతా పనిచేస్తేనే మరుసటి రోజు స్పెషల్ ఆఫ్ ఇస్తున్నారు. అలాగే అనారోగ్యం పాలైన సిబ్బంది సంబంధిత డాక్టర్ల నుంచి మెడికల్ సర్టిఫికెట్ తీసుకురావాల్సి ఉంటున్నది. ఇతర సెలవులు కావాలంటే అనుమతి తప్పకుండా తీసుకోవాల్సిందే.