హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): టీఎస్ఆర్టీసీకి టికెట్ల ద్వారా వస్తున్న రోజువారీ ఆదాయాన్ని మరో రూ.3 కోట్లకు పెంచితే, సంస్థ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ప్రస్తుత రోజువారీ ఆదాయం రూ.9 కోట్లు ఉన్నదని వెల్లడించారు. ఆదివారం ఆయన సంస్థ ఆర్థిక పరిస్థితిపై అధికారులతో సమీక్షించారు. త్వరలో ఎన్సీడీసీ బ్యాంక్ ద్వారా రూ.500 కోట్ల రుణం వస్తుందని, వీటిని పదవీ విరమణ పొందిన ఉద్యోగుల కోసం వెచ్చిస్తామని, సీసీఎస్ బకాయిలు చెల్లిస్తామని చెప్పారు. బడ్జెట్లో ఆర్టీసీకి రూ.1,500 కోట్లు కేటాయించిన ప్రభుత్వం మరో రూ.1,500 కోట్లు బడ్జెటేతర నిధులుగా సమకూరుస్తున్నదని పేర్కొన్నారు.