హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బస్‌స్టేషన్ సమీపంలోని 7,059 చదరపు గజాల భూమిని విష్ణుజిత్ ఇన్ ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ ఆర్టీసీ) గతంలో అద్దెకిస్తూ ఒప్పందం చేసుకొన్నది. ఈ మేరకు ప్రస్తుతం ఆ సంస్థ.. ఆర్టీసీకి రావాల్సిన రూ.2.51 కోట్ల అద్దె బకాయిలను చెల్లించడం లేదని యాజమాన్యం పేర్కొన్నది.
హైకోర్టు ద్వారా ఈ నెల 9న నోటీసులిచ్చినా ఎలాంటి స్పందన లేదని శనివారం ఆర్టీసీ అధికారులు తెలిపారు. శుక్రవారం నిజామాబాద్‌లో మీడియా సమావేశంలో ఆర్టీసీ అద్దె భూముల అంశంపై టీఎస్ఆర్టీసీ, ఆ సంస్థ ఉన్నతాధికారులపై మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అసత్య ఆరోపణలు చేశారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. అద్దె బకాయిల విషయంలో లీజ్ ఒప్పందం, హైకోర్టు ఆదేశాల ప్రకారమే సంస్థ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టంచేశారు.