హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ఆర్టీసీ చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే టీ-9 టికెట్, టీ-24 టికెట్, ప్రత్యేక రోజుల్లో టికెట్ ధరలపై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నది. తాజాగా హైదరాబాద్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ప్రయాణించేవారికి మరో ఆఫర్ ప్రకటించింది. కనీసం ముగ్గురు కలిసి ప్రయాణం చేస్తే టికెట్ చార్జీలో డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు వెల్లడించింది. ముగ్గురు ఆపై ఎంతమంది కలిసి వెళ్లినా మొత్తం చార్జీలో 10 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు ఆర్టీసీ సికింద్రాబాద్ రీజినల్ మేనేజర్ వెంకన్న చెప్పారు. క్యాబ్‌లు, ఆటోలు, ఇతర ప్రైవేట్ వాహనాల నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొనేందుకు ఆర్టీసీ ఈ రాయితీ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు. నగరంలోని వివిధ మార్గాల్లో ఎయిర్‌పోర్టు వరకు కనిష్ఠంగా రూ.50, గరిష్ఠంగా రూ.300 వరకు టికెట్ చార్జీలు వసూలు చేస్తున్నారు. కుటుంబసభ్యులు కలిసి వెళ్లినప్పుడు ప్రయాణించే దూరం, ప్రయాణికుల సంఖ్యను బట్టి డిస్కౌంట్ ఉంటుందని అధికారులు చెప్తున్నారు.