హైదరాబాద్, జూలై 20(నమస్తే తెలంగాణ) : కార్మిక సంఘాల ఎన్నికల తర్వాతే ఆర్టీసీ విలీన ప్రక్రియ ఉంటుందని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మరోసారి స్పష్టంచేశారు. సోమవారం ఆర్టీసీ కళాభవన్‌లో దివంగత ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్‌గౌడ్ కుటుంబానికి ఆర్టీసీ కార్మికులు తమ వేతనం నుంచి ఇచ్చిన రూ.90.85 లక్షల చెక్కును అతని కుటుంబానికి మంత్రి, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ఆర్టీసీ విలీన ప్రక్రియ విషయంలో మాట తప్పేది లేదని తెలిపారు. అయితే, ఈ ప్రక్రియ సజావుగా సాగాలంటే ముందుగా కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించాల్సిందేనని స్పష్టంచేశారు. శంకర్ గౌడ్ కుటుంబానికి అండగా నిలిచిన కార్మికులకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. శంకర్‌గౌడ్ కుమారుడికి ఆర్టీసీలో ఉద్యోగం ఇస్తామని, వారికి ఇల్లు కూడా మంజూరు చేశామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు, శంకర్‌గౌడ్ సతీమణి హేమలత, కుమారుడు హేమంత్, కుమార్తె షాలిని, ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు, సిబ్బంది పాల్గొన్నారు.