కలబురగి, అక్టోబర్ 3: కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆరోపణ చేశారు. ఇటీవల దేశంలో జరిగిన ఎన్నికలన్నీ చట్టవిరుద్ధ్ధమని పేర్కొన్న ఆయన, లోక్సభ సహా అన్ని శాసనసభలను రద్దు చేసి తాజాగా బ్యాలట్ పేపర్తో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ‘చట్టవిరుద్ధంగా జరిగిన ఎన్నికల ద్వారా ఎన్నికైన ప్రభుత్వాల ద్వారానే నేడు దేశమంతా నడుస్తున్నది.
మోదీ ఒక చట్టవిరుద్ధ ప్రధాని.. షా చట్టవిరుద్ధ మంత్రి. దేశంలో మిగతా చోట్ల నుంచి ఎన్నికైన అందరు ముఖ్యమంత్రులు కూడా చట్టవిరుద్ధంగా ఎన్నికయ్యారు. కాబట్టి వాటన్నింటినీ రద్దు చేసి ఎన్నికలు నిర్వహించాలి. అయితే ఈసారి ఎన్నికలు బ్యాలట్ పేపర్ విధానంలో జరపాలి’ అని ఆయన కర్ణాటకలోని కలబురగిలో మీడియాతో మాట్లాడుతూ డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా పలు చోట్ల జరిగిన, జరుగుతున్న సర్ ప్రక్రియపై ఆయన మాట్లాడుతూ దీనిలో పలు అక్రమాలు జరిగాయని, ఈవీంఎల ద్వారా జరిగిన ఓటింగ్ దుర్వినియోగం అయ్యిందని చెప్పారు. ఎన్నికల ప్రక్రియ దుర్వినియోగంపై తాము నిర్వహిస్తున్న ఆందోళన కొనసాగుతుందని చెప్పారు.