సిటీబ్యూరో, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ ) : నగరంలో రాత్రి బస్సు సర్వీసులను మరిన్ని రూట్లలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆర్టీసీ యోచిస్తుంది. నగరంలో ప్రయాణికుల రాకపోకలు రాత్రి సమయాల్లోను అధికంగా ఉంటున్న దృష్ట్యా అందుకు తగ్గట్టు థర్ట్షిఫ్ట్ పేరుతో రాత్రి బస్సు సర్వీసులను ఆర్టీసీ ప్రారంభించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 1 నుంచి నగరంలోని 6 రూట్లలో తెల్లవారుజాము 3 గంటల వరకు బస్సులు నడుస్తున్నాయి. ఈ క్రమంలో మరి కొన్ని రూట్లలోను ఇలాంటి బస్సు సేవలు ప్రవేశపెట్టడానికి క్షేత్రస్థాయి అధ్యయనం చేస్తోంది. రాత్రి సమయాల్లో అత్యధికంగా ప్రయాణికుల రద్దీ ఉన్న రూట్లపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
ఇప్పటికే కోఠి నుంచి పటాన్ చెరు(222ఏ), అఫ్జల్గంజ్ నుంచి పటాన్ చెరు(218), సికింద్రాబాద్ నుంచి పటాన్ చెరు (219), హయత్నగర్ నుంచి సికింద్రాబాద్ (290యూ), బాచుపల్లి నుంచి వేవ్ రాక్(195డబ్ల్యూ), కొండాపూర్ నుంచి సికింద్రాబాద్ (10హెచ్ ) రూట్లల్లో థర్డ్షిఫ్ట్ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ బస్సుల్లో ప్రయాణికుల రాకపోకలు అధికంగానే ఉండటంతో మరిన్ని రూట్లలో ప్రవేశపెట్టి ఆదాయాన్ని సమకూర్చుకునేలా ప్రణాళికలు చేస్తున్నారు. సాధారణంగా రాత్రి సమయాల్లో ప్రయాణాలు చేయాలంటే యాప్ ఆధారిత సేవలు లేదా ట్యాక్సీ మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే అందుకు డబ్బులు రెట్టింపు ఛార్జీ చేస్తుంటారు.
ఆ డబ్బులు చెల్లించలేక చాలా మంది ప్రయాణికులు రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు బస్టాండ్స్, రైల్వే స్టేషన్లలోనే వేచి ఉండి బస్సు రాకపోకలు ప్రారంభమయ్యాక బయలుదేరుతుంటారు. కానీ ఇప్పుడు రాత్రి సమయాల్లో బస్సులు అందుబాటులోకి రావడంతో దూర ప్రాంతాల నుంచి నగరానికి చేరుకుంటున్న వారికి రాత్రి బస్సులు ఉపయోగకరంగా మారాయి. ప్రయాణికులు సైతం రాత్రుల్లో ఎలాంటి భయం లేకుండా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా నగరంలోని మరిన్ని మార్గాల్లో రాత్రి బస్సు సేవలు అందుబాటులోకి రానున్నాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు.