కరీంనగర్ తెలంగాణచౌక్, జూన్ 13 : ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలను నిర్వహించిన తరువాతే ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే ప్రక్రియ ముందుకు సాగుతుందని ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాల్మన్ తెలిపారు. కరీంనగర్లోని బస్స్టాండ్ సముదాయంలోని ఈడీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఏప్రిల్లో సమ్మె సమయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ చర్చల్లో 2021 వేతన సవరణ, యూనియన్ల పునరుద్ధరణతోపాటు సంస్థను ప్రభుత్వంలో విలీన పక్రియ వంటి మూడు అంశాలను యూనియన్ నాయకులు కమిటీ ముందు ఉంచినట్టు చెప్పారు. విలీన అంశాన్ని లోతుగా పరిశీలన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉన్నత కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. ఇందులో ప్రతి కార్మికుడు తన స్వరం వినిపించాలనే సదుద్దేశంతో యాజమాన్యం.. రాష్ట్రంలోని అన్ని డిపోల్లో కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలిచిన యూనియన్ను విలీన ప్రక్రియలో ప్రతక్ష్య భాగస్వాములను చేస్తామని చెప్పారు. గెలుపొందిన యూనియన్ నాయకులు ఇచ్చే సలహాలు, సూచనల మేరకు విలీన ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. పెరిగిన డీజిల్ ధరలతో ఆర్టీసీ మీద ఆర్థిక భారం పడుతున్నదని, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులపై భారం పడకూడదని టికెట్ ధరలను పెంచడం లేదని అన్నారు.