Ponnam Prabhakar | హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ విలీనం, యూనియన్ల పునరుద్ధరణ ఇప్పట్లో అమలు చేయలేమంటూ రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ చేతులెత్తేశారు. ఇవి ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న ప్రధాన అంశాలని, వాటిపై ఒక స్పష్టత వచ్చేవరకూ వాటి గురించి కార్మికులు అడగొద్దని, యూనియన్లు పోరాడవద్దని చెప్పారు. ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమం సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆర్టీసీ విలీనం, కార్మిక జేఏసీ చేపట్టిన సమ్మె, రేడియం స్టిక్కర్ల వివాదంపై మీడియా ప్రతినిధు ల ప్రశ్నలకు ఆయ న సమాధానం దాటవేసే ప్రయ త్నం చేశారు.
ఆర్టీసీ విలీన అంశం, యూనియన్ల పునరుద్ధరణపై నిర్ణయం తీసుకునేందుకు తగిన సమయం కావాలని మంత్రి పొన్నం తెలిపారు. ఎలాంటి విధి విధానాలు లేకుండా అంత పెద్ద సంస్థను ఎలా విలీనం చేస్తారని, దాని గురించే ఒక కమిటీ వేసినట్టు చెప్పుకొచ్చారు. ఇప్పటికే డీఏ ఇచ్చామని, పీఆర్సీకి కూడా ఆలోచన చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రేరేపితమైన అంశాలు, సమ్మెలకు కార్మికులు లోనుకావొద్దని సూచించారు. వాళ్ల సమస్యలు వినడానికి, పరిష్కారం చేయడానికి ప్రభుత్వం, ఆర్టీసీ అధికారులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఆ రెండు అంశాలు తప్ప.. అన్నీ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ ప్రతినిధులను లేబర్ కమిషన్ చర్చలకు పంపుతారా? అనే ప్రశ్నకు ఆర్టీసీలో గుర్తింపు సంఘమే లేనప్పుడు వారిని చర్చలకు పిలువడంలో ఆర్థం లేదని తెలిపారు.
భారీ వాహనాలకు వేసే రేడియం స్టిక్కర్లను ఐదు కంపెనీలు సిండికేట్‌గా మారి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని మీడియా ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా అధికారులతో విచారణ జరిపిస్తామని మంత్రి పొ న్నం హామీ ఇచ్చారు. వాటి నాణ్యత, ఇతర వివరాలపై మీడియాకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. గతంలో నాణ్యత లేని స్టిక్కర్లు వేయడం వల్ల ప్రమాదాలు అధికంగా జరిగాయని, ఇప్పుడు అత్యంత నాణ్యమైన స్టిక్కర్లు వేయిస్తున్నామని తెలిపారు. ఈ నెల 13 నుంచి 18 వరకు అరైవ్-అలైవ్‌పై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.