హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను కొందరు మోసం చేస్తున్నట్టు యాజమాన్యం దృష్టికి వచ్చిందని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ అనుమతి మేరకు సంస్థలో 3,038 పోస్టుల భర్తీకి సంబంధించిన కసరత్తు ప్రారంభమైందని, ఈ పోస్టులకు ప్రభుత్వ నియామక బోర్డుల ద్వారా నోటిఫికేషన్ త్వరలోనే వెలువడనుందని తెలిపారు. నియామక ప్రక్రియ పూర్తిగా మెరిట్ ఆధారంగా, పారదర్శకంగా జరుగుతుందని హామీ ఇచ్చారు. అడ్డదారుల్లో ఎవరికీ కూడా ఉద్యోగాలు రావని స్పష్టంచేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రలోభాలకు గురిచేసేవారి మాటలు నమ్మవద్దని, వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.