కొల్లాపూర్ : నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు గ్రామానికి చెందిన ఆశా కార్యకర్త (ASHA activist) మల్లికాంతమ్మను సోమవారం తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్( RTC MD Sajjanar ) శాలువాతో సత్కరించారు. ఈ నెల 16న ఎల్లూరు గ్రామానికి చెందిన సువర్ణ ( Suvarna ) అనే గర్భిణి హెల్త్ చెకప్ నిమిత్తం ఆశా కార్యకర్త మల్లికాంతమ్మతో కలిసి జిల్లా ప్రభుత్వ దవాఖానకు వెళ్లింది.
కాన్పు అయ్యేందుకు వారం రోజులు సమయం ఉందని పెద్ద స్కానింగ్ చేయించుకొని రావాలని డాక్టర్ సూచించడంతో ఆమె నాగర్‌కర్నూల్ నుంచి కొల్లాపూర్‌కు హైదరాబాద్ డిపో ఆర్టీసీ బస్సులో బయలు దేరింది. అయితే పెద్దకొత్తపల్లి మండల పరిధిలో ఆదిరాల సమీపంలో సువర్ణకు నొప్పులు రావడంతో వెంటనే స్పందించిన ఆశా కార్యకర్త ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్‌కు వివరించడంతో వారు బస్‌ను ఆపివేసి మగవారిని కిందికి దించివేసింది.
ఆశా కార్యకర్త తో పాటు మరికొంతమంది మహిళలు కలసి ఆర్టీసీ బస్సులోనే ప్రసవం చేయడంతో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం కొల్లాపూర్ డిపో మేనేజర్ ఉమాశంకర్ తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లగా ఆర్టీసీలో జన్మించిన పండంటి బిడ్డకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం సౌకర్యం, ఆశా కార్యకర్త మల్లికాంతమ్మకు సన్మానంతో పాటు ఒక సంవత్సరం పాటు తెలంగాణ ఆర్టీసీ సూపర్ లగ్జరీ ( Super Luxury ) సర్వీసులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు.
ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్లను తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం అభినందించింది. గర్భవతి వెంట తోడుగా ఉండి నిండు ప్రాణాలను కాపాడిన ఆశా కార్యకర్త మల్లికాంతమ్మను కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం శ్రీనివాసులు మంగళవారం అభినందించారు.