హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్లుగా ఆర్టీసీ కార్మిక సంఘాలను పునరుద్ధరించడంలేదని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఐఎన్టీయూసీ) నేత కే రాజిరెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఐఎన్టీయూసీ ఆఫీస్‌లో ముఖ్యనాయకులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సమస్యలు విన్నవిస్తూ ప్రకటన విడుదల చేశారు. కార్మికుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లాలని ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డిని, సీఎంవోలో అజిత్‌రెడ్డిని కలిశామని చెప్పారు. అయినా సీఎం అపాయింట్మెంట్ దొరకడంలేదని చెప్పారు. సీఎం అపాయింట్మెంట్ కోసం జైపాల్‌రెడ్డి అనే వ్యక్తికి 18 నెలలుగా ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదని తెలిపారు. కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీలో 38 ఏండ్లుగా చిత్తశుద్ధితో పనిచేసిన తాను.. కార్మికులకు సమాధానం చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నట్టు ఆవేదన వ్యక్తంచేశారు. కార్మికుల్లో అసంతృప్తిని తగ్గించాలన్నా, యూనియన్‌పై నమ్మకం కలిగించాలన్నా.. ఈనెల 31లోపు ఆర్టీసీలో యూనియన్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే నిరవధిక నిరహార దీక్ష చేపడుతామని హెచ్చరించారు.