హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ప్రజలపై పెనుభారం మోపింది. బస్‌పాస్ ధరలను 20 శాతానికి పైగా పెంచింది. పెరిగిన చార్జీలు మంగళవారం నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టంచేసింది. ఆర్టీసీ ఆర్డీనరీ బస్‌పాస్ నెలకు రూ.1150 ఉండగా రూ.1400కు పెంచింది. మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్‌పాస్ ధర రూ.1300 ఉండగా రూ.1600కు, మెట్రోడీలక్స్ బస్‌పాస్ ధర రూ.1450 నుంచి రూ.1800కు పెంచింది. ఈ తరహా పాస్‌లు హైదరాబాద్, వరంగల్ సిటీ బస్సుల్లో ఎక్కువగా ఉంటాయి. బస్‌పాస్ ధరల పెంపుపై మధ్యతరగతి ప్రజలు, చిరుద్యోగులు, విద్యార్థులు తీవ్రఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చార్జీల పెంపుపై పునరాలోచించాలని, నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విద్యార్థి, ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఆర్టీసీ బస్‌పాస్ ధరల పెంపును తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మళ్లీ 20శాతం చార్జీలు పెంచితే బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులపై భారం పడుతుంది. ఆర్టీసీ చాలా రూట్లలో విద్యార్థులు కోసం బస్సులు నడపడం లేదు. బస్సులు పెంచి, ఉచిత బస్‌పాస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తుంటే చార్జీలు పెంచడం దుర్మార్గపు చర్య. పెంపును వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తాం.
భారత జాతీయ రహదారుల సాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ) ఏటా టోల్ ట్యాక్స్‌ను సవరిస్తున్నది. టోల్‌ట్యాక్స్ పెరిగినప్పుడు ప్రయాణికుల యూజర్ చార్జీలు పెంచుకునేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం జీవో 24 జారీ చేసింది. జీవో ప్రకారమే చార్జీలను పెంచాం. విద్యార్థుల బస్‌పాస్ చార్జీలు మూడేండ్లుగా పెంచలేదు. పెరిగిన నిర్వహణ కారణంగా బస్‌పాస్, సాధారణ ప్రయాణికుల బస్పాసుల చార్జీలను సవరించాం. హైదరాబాద్, సబర్బన్ ప్రాంతాలలో ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థుల రద్దీ ఎక్కువగా ఉన్నందున సిటీ ఆర్డీనరీ బస్సులు ఓవర్‌లోడ్ అవుతున్నాయి. సిటీ ఆర్డినరీ బస్సులతో పాటు హైదరాబాద్‌లోని మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్‌లలోనూ విద్యార్థులను అనుమతించాలనే ఉద్దేశంతో చార్జీలను పెంచాం.
రాష్ట్ర ప్రభుత్వం సాధారణ ప్రజలు, విద్యార్థుల బస్‌పాస్ ధరలను పెంచి ప్రయాణీకులపై విపరీతమైన భారం మోపింది. హైదరాబాద్‌లో ఒకో ప్రయాణికునిపై నెలకు రూ.250 నుంచి రూ.300 వరకు అధిక భారం పడుతున్నది. పేదలు ఎక్కువగా ప్రయాణించే ఆర్టీసీ బస్సుల్లో పెద్దఎత్తున చార్జీలు పెంచడం ప్రభుత్వానికి, టీజీఆర్టీసీకి తగదు. తక్షణమే పెంపును వెనక్కి తీసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ప్రయాణం ఉచిత అంటూనే చిరుద్యోగులపై భారం మోపడం సరికాదు.