హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీకి ట్రాఫిక్ చలాన్లు భారంగా మారాయి. నిత్యం ఎంతో మంది ఆర్టీసీ డ్రైవర్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతుండటంతో సంస్థకు ఏటా వేల సంఖ్యలో చలాన్లు జారీ అవుతున్నాయి. అలా 2022 నుంచి ఈ ఏడాది జనవరి వరకు 25,609 ఈ-చలాన్లు జారీ అయ్యాయి. వీటిలో 15,529 చలాన్లను చెల్లించకుండా ఆర్టీసీ యాజమాన్యం పెండింగ్‌లో పెట్టింది. యుగాంతర్ ఫౌండేషన్‌కు చెందిన యూఆర్టీఐ సంస్థ ఇటీవల సమాచార హక్కు చట్టం కింద సేకరించిన సమాచారంతో ఈ వివరాలు వెల్లడయ్యాయి. దీంతో ఆర్టీసీ రూ.కోటికిపైగా జరిమానా చెల్లించాల్సి ఉన్నట్టు స్పష్టమైంది. ఇప్పటికే కార్మికులకు రూ.వందల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉన్న ఆర్టీసీకి ఈ చలాన్లు మరో సమస్యగా మారాయి.
ఆర్టీసీ బస్సుల ట్రాఫిక్ ఉల్లంఘనల్లో ప్రయాణికుల కోసం చేస్తున్న పొరపాట్లే ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది. ప్రయాణికులను ఎక్కించుకునేందుకు చాలా మంది ఆర్టీసీ డ్రైవర్లు రోడ్లపై ఎక్కడపడితే అక్కడ బస్సులు ఆపుతున్నారు. బస్‌బేలను పట్టించుకోవడం లేదు. స్టాఫ్లైన్ క్రాసింగ్, ఫ్రీలెఫ్ట్ వయలేషన్ లాంటి ఉల్లంఘనలు నిత్యకృత్యమైపోయాయి. దీనికితోడు బస్‌స్టాపుల్లో ఆటోలు తిష్టవేస్తుండటంతో ఆర్టీసీ బస్సులు రోడ్లపైనే ఆగాల్సి వస్తున్నది. ప్రైవేట్ వాహనాల మాదిరిగా ట్రాఫిక్ పోలీసులు ఆర్టీసీ బస్సులపై కఠిన చర్యలు చేపట్టకపోవటంతో వేల చలాన్లు పెండింగ్‌లో ఉండిపోతున్నాయి.