యాచారం/కరీంనగర్ తెలంగాణచౌక్, ఫిబ్రవరి 28: మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఓ ఆర్టీసీ కండక్టర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఉదయం చోటుచేసుకున్నది. సీఐ నందీశ్వర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. యాచారం మండలం గాండ్లగూడకు చెందిన కోరె అంజయ్య (55) ఇబ్రహీంపట్నం డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా అతను వ్యక్తిగత కారణాలతో మానసికంగా ఒత్తిడికి గురవుతున్నాడు. దీంతో జీవితంపై విరక్తి చెందిన ఆయన పదిహేను రోజుల క్రితమే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు నగరంలోని దవాఖానకు తరలించి సకాలంలో చికిత్స అందించడంతో కోలుకున్నాడు. మళ్లీ గురువారం సాయంత్రం గడ్డి మందు తాగాడు. గుర్తించిన స్థానికులు, కుటుంబ సభ్యులు హుటాహుటిన వనస్థలిపురంలోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతున్న అంజయ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నందీశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.
కరీంనగర్-1 డిపో ఎదుట అద్దె బస్సు డ్రైవర్ శుక్రవారం ఆత్మహత్యకు యత్నించాడు. డబ్బాలో తెచ్చుకున్న పెట్రోల్ పోసుకుంటుండగా గమనించిన సెక్యూరిటీ సిబ్బంది నీళ్లు పోసి కాపాడారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలానికి చెందిన సురేశ్ అద్దె బస్సు డ్రైవర్. అనంతపల్లి రూట్ పల్లె వెలుగు బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత సెప్టెంబర్ నెలలో డ్యూటీకి వచ్చిన సురేశ్‌ను రోజు వారి తనిఖీలో భాగంగా బ్రీత్ ఎనలైజ్ టెస్టు చేయగా 93 శాతం వచ్చింది. ఆర్టీసీ నింబంధనల ప్రకారం డ్యూటీ ఇవ్వకుండా పక్కకు పెట్టారు. డ్యూటీలో చేర్చుకోవాలని అధికారులను వేడుకోగా నివేదిక రాకపోవడంతో అధికారులు డ్యూటీ ఇవ్వలేదు. దీంతో జీతం రాక సురేశ్ ఆరునెలలుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు కార్మిక సంఘం నాయకులు తెలిపారు. మనోవేదనకు గురైన సురేశ్ కరీంనగర్ డిపో-1 ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించినట్టు వారు పేర్కొన్నారు.