యాచారం, ఫిబ్రవరి 28: పని ఒత్తిడి కారణంగా మనస్థాపానికి గురై ఓ ఆర్టీసీ కండక్టర్ (RTC Conductor) ఆత్మహత్య చేసుకున్న ఘటన యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. దీనికి సంబంధించి సీఐ నందీశ్వర్ రెడ్డి, స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. యాచారం మండల పరిధిలోని గాండ్లగూడ గ్రామానికి చెందిన కోరే అంజయ్య (40) ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపోలో కండక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా ఒత్తిడికి గురవుతున్నాడు. దీంతో ఆయన 15 రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. గమనించిన కుటుంబ సభ్యులు దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ మామూలు స్థితికి చేరుకున్నారు.
అయితే గురువారం సాయంత్రం మళ్లీ పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. దీంతో అతడిని హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆర్టీసీ అధికారుల ఒత్తిడితోనే అంజయ్య పలుమార్లు మానసికంగా ఇబ్బందులకు గురైనట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఉద్యోగ ఒత్తిడితోనే అంజయ్య ఆత్మహత్యకు పాల్పడినట్లు తోటి ఆర్టీసీ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.