హైదరాబాద్ : ప్రజాస్వామ్యాన్ని కేంద్ర ప్రభుత్వం అపహాస్యం చేస్తోందని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్ ఎల్పీలో మంగళవారం ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీ పార్టీ.. రాబంధుల పార్టీల మారిందని ఆరోపించారు. ప్రత్యర్థులను వేధించడంలో అన్ని రికార్డులను కేంద్రం అధిగమించిందని, ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వాలను బీజేపీ కూల్చివేస్తోందన్నారు. మోదీ, అమిత్ షాల అరాచకాలకు హద్దు లేకుండా పోతోందని, ఇప్పుడు వారి అరాచక దృష్టి తెలంగాణపై పడిందన్నారు. వారిపై ప్రజలు తిరుగుబాటు చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, ఏదీ శాశ్వతం కాదని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ కవితను సంబంధం లేని కేసులో ఇరికించాలని చూస్తున్నారని, ఏక్కడో ఢిల్లీలో జరిగిందట.. మోకాలికి, బోడిగుండుకు లింకుపెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఇలాంటి చిల్లర రాజకీయాలకు కేసీఆర్ భయపడరని స్పష్టం చేశారు.
పీయూసీ చైర్మన్ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. కవితపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. బీజేపీ రౌడీయిజం, మోదీ ఈడీయిజం తెలంగాణలో నడవవని, కవితపై ఆరోపణలు చేసిన వారిపై లుక్ అవుట్ నోటీసులు ఉన్నాయని గుర్తు చేశారు. కవితమ్మ తెలంగాణ బతుకమ్మ అని.. బతుకమ్మ జోలికి వస్తే బతుకు బుగ్గిపాలేనన్నారు. కవితకు టీఆర్ఎస్ అండగా ఉంటుందని, సీబీఐ.. ఈడీ బీజేపీ జేబు సంస్థలుగా, కీలుబొమ్మలుగా మారాయని విమర్శించారు. ప్రత్యర్థులను వేధించడానికి బీజేపీ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. కేసు గురించి సంస్థలు చెబుతాయా? బీజేపీ నేతలు చెబుతారా ? అని ప్రశ్నించారు. బీజేపీ నేతలపై పరువు నష్టం దావా వేస్తానని ఇప్పటికే కవిత ప్రకటించారన్నారు. విచారణకు సిద్ధమేనని కవిత ఇప్పటికే ప్రకటించారని.. కవిత జోలికి వస్తే యావత్
తెలంగాణ కన్నెర్ర చేస్తుందన్నారు.
బీజేపీ గెలికి కయ్యం పెట్టుకోవద్దని.. మాకు 60లక్షల సైన్యం ఉందని జీవన్‌రెడ్డి తెలిపారు. తాము తలచుకుంటే బీజేపీ కార్యకర్తలు రోడ్లపై తిరుగరని హెచ్చరించారు. బీజేపీ మాటవింటే, మోదీకి లొంగిపోతే కేసులు మాఫీ అవుతాయని, వినకుంటే సీబీఐ, ఈడీ దాడి చేస్తాయని ఆరోపించారు. సీబీఐ, ఈడీలు బీజేపీ చేరికల కమిటీగా మారాయని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఫైటర్ అనీ, దేనికి భయపడరని స్పష్టంచేశారు. కేసీఆర్‌ను మానసిక క్షోభకు గురి చేసేందుకు బీజేపీ నేతలు కవితపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. అమిత్‌షా ఐటీ ఇజానికి ఎవరూ భయపడరని, బీజేపీ కండువా కప్పుకుంటే కేసులు మాఫీ అవుతాయా? ఎందరో నియంతలు కాలగర్భంలో కలిసిపోయారని, మోదీకి కూడా అది తప్పదన్నారు. ఈడీ కేసులు పట్టుకొని వేలాడుతున్నారని, ఎన్ని కొలిక్కి వచ్చాయో బీజేపీ నేతలు చెప్పగలరా? నోటీసులు ఇచ్చాక లొంగిపోయిన వారిపై చర్యలు ఎందుకు ఉండవో ఈడీ చెప్పగలదా? అని నిలదీశారు.