హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ కార్గో సేవలను మరింత విస్తరించేందుకు యాజమాన్యం ఏర్పాటు చేస్తున్నది. వినియోగదారుల ఇండ్ల వద్దే ‘పికప్ టు డెలివరీ’కి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న ది. ఈ సేవలను మరింత విస్తరించి ఏటా అదనంగా రూ.300కోట్ల ఆదాయం సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ప్రస్తుతం అన్ని ప్రధాన పట్టణాలు, నగరాల్లో కార్గో బుకింగ్ కోసం ఆర్టీసీలో ప్రత్యేక వ్యవస్థ ఉ న్నది. పెద్ద మొత్తంలో బుకింగ్ ఉన్నప్పుడు వారి నుంచి నేరుగా సరుకులు తీసుకొని రవాణా చేస్తున్నది. డెలివరీ మాత్రం హైదరాబాద్‌లాంటి మహా నగరంలో జేబీఎస్, సీబీఎస్, ఉప్పల్ ప్రాంతాల్లో మాత్రమే ఉన్నది.
మిగతా పట్టణాల్లో కేవలం బస్టాండ్లలో మాత్రమే డెలివరీ తీసుకోవాలి. దీనివల్ల చాలామంది కస్టమర్లు ఇబ్బంది పడుతున్నారు. దీనిపై దృష్టిసారించిన ఆర్టీసీ వినియోగదారుల చెంతకే వస్తువులను డెలివరీ చేయాలని ప్రణాళికలు వేసింది. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఇంటి నుంచే పికప్ చేసుకోవాలని ఆలోచిస్తున్నది. మొదట హైదరాబాద్‌లో వెయ్యిచోట్ల ఈ సేవలను ప్రారంభించి, వాటి ఫలితాల ఆధారంగా ఇతర ప్రాంతాల్లో ప్రారంభించాలనే యోచనలో ఉన్నట్టు అధికారులు తెలిపారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గాడిలో పెట్టాలంటే ప్రత్యామ్నాయ ఆదాయమే మార్గమని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హయాంలో రూపొందించిన ఈ కార్గో సేవలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఆర్టీసీకి అదనపు ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి.