RTC Buses | హైదరాబాద్ : మరికొద్ది గంటల్లో గణేశ్ నిమజ్జన ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పటికే కొన్ని వేల విగ్రహాలు నిమజ్జనం కాగా.. మిగిలిన వాటిని శనివారం నిమజ్జనం చేయనున్నారు. ఈ క్రమంలో నగరం నలువైపులా నుంచి ట్యాంక్ బండ్, సరూర్ నగర్ చెరువులకు భారీ సంఖ్యలో గణనాథులు తరలివచ్చి గంగమ్మ ఒడికి చేరనున్నాయి.
ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు పోలీసు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి శనివారం ఉదయం హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌కు వచ్చే ఆర్టీసీ బస్సులను నగర శివారు ప్రాంతాలకే పరిమితం చేయనున్నారు. శంషాబాద్ మీదుగా బెంగళూరు, మహబూబ్‌నగర్ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను ఆరాంఘర్ వద్దనే నిలిపివేయనున్నారు. వరంగల్ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను ఉప్పల్ వద్ద, విజయవాడ, నల్లగొండ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను ఎల్బీనగర్ వద్ద నిలిపివేయనున్నారు. వికారాబాద్, మొయినాబాద్ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను మెహిదీపట్నంకు పరిమితం చేయనున్నారు. కరీంనగర్, సిద్దిపేట, నిజామాబాద్ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను జేబీఎస్లో నిలిపివేయనున్నారు. ఈరాత్రికి ఎంజీబీఎస్ చేరుకుని, మళ్లీ తెల్లవారుజామున తిరిగి వెళ్లే అంతర్ రాష్ట్ర, జిల్లా బస్సులను చాదర్‌ఘాట్ వైపు దారి మళ్లించనున్నారు.