పెబ్బేరు/హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడి ఒకరు మృతి చెందగా ఇరువై మందికిపైగా ప్రయాణికులకు తీవ్ర గాయాలైన ఘటన వనపర్తి జిల్లా పెబ్బేరు సమీపంలోని 44వ జాతీయ రహదారిపై సోమవారం ఉదయం చోటుచేసుకున్నది. వనపర్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంత్రాలయం నుంచి తెల్లవారుజామున వనపర్తికి బయలు దేరింది. బస్సు రంగాపురం గ్రామం దాటి పెబ్బేరుకు చేరుకొనేలోపే అదుపుతప్పి డివైడర్‌పై అడ్డంగా పడిపోయింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 61మంది ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఒకరిపై ఒకరు పడిపోయి గాయాలయ్యాయి. సీట్ల కింద ఇరుకున్న వారిని స్థానికులు వచ్చి అతికష్టం మీద బయటకు తీశారు.
చావు అంచులదాక వెళ్లిన ప్రయాణికులు బస్సు అద్దాలు పగులగొట్టి బయటపడ్డారు. ప్రయాణికుల్లో సుమారు 20 మందికిపైగా బలమైన గాయాలు కాగా, వారిలో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. గాయపడిన వారిని వనపర్తి, కర్నూల్, హైదరాబాద్ దవాఖానలకు తరలించారు. మృతుడు మహబూబ్‌నగర్ ఆర్టీసీ డిపోలో అసిస్టెంట్ ఇంజినీర్ శివరాంప్రసాద్ (59)గా గుర్తించారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కొత్తకోట సీఐ రాంబాబు, పెబ్బేరు ఎస్సై వెంకటేశ్‌గౌడ్ తెలిపారు. బస్సు ప్రమాదానికి గురైన వెంటనే అటుగా వెళ్తున్న అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు తన వాహనాన్ని ఆపి సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
స్వయంగా బస్సులోకి వెళ్లి సీట్ల కింద ఇరుక్కున్న ప్రయాణికులను బయటకు తీసేందుకు ప్రయత్నించారు. గాయపడ్డ వారిని అంబులెన్స్‌లో ఎక్కించే వరకు ఆయన అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. బస్సు ప్రమాద ఘటనపై రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులందరికీ మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్, ఎస్పీ, ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఫోన్ చేసి ఘటన జరుగడానికి గల కారణాలను తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన అన్ని భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయాలని సూచించారు. గాయపడిన ప్రయాణికులు త్వరగా కోలుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు.