హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ ): ప్రయాణికుల నడ్డి విరిచేందుకు కాంగ్రెస్ సర్కార్ రంగం సిద్ధం చేసింది. మహాలక్ష్మి (Mahalakshmi) పేరుతో మహిళలకు ఫ్రీబస్ (Free Bus) సర్వీస్ కల్పించిన ప్రభుత్వం ఇప్పుడు సామాన్యులను అడ్డంగా దోచుకునేందుకు రెడీ అయింది. విద్యార్థుల బస్ పాస్‌లు, టీ-24 టికెట్ ధరలను ఇప్పటికే పెంచిన ఆర్టీసీ ఇప్పుడు జంట నగరాల్లో టికెట్ ధరలను పెంచింది. కనీస చార్జీపై 50 శాతం టికెట్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నగరంలోని సిటీ బస్సు మొదటి స్టేజ్ వరకు చార్జీ రూ. 10గా ఉంటే ఇప్పుడు దానిపై మరో రూ. 5 పెంచుతూ రూ. 15 చేసింది. అంటే మొదటి మూడు స్టేజీలకు అదనంగా రూ. 5 వసూలు చేయనుంది.
నాలుగో స్టేజీ నుంచి కనసీ చార్జీపై అదనంగా రూ. 10 వసూలు చేయనుంది. నాలుగో స్టేజీ వరకు ప్రస్తుతం రూ. 20 ఉన్న టికెట్ తాజా పెంపుతో రూ. 30గా మారింది. గ్రేటర్ జోన్ పరిధిలో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ , ఈ-ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో పెరిగిన ధరలు అమలుకానున్నాయి. పెరిగిన ధరలు సోమవారం నుంచి అమలులోకి రానున్నాయి. ఇప్పటి వరకు సికింద్రాబాద్ నుంచి అల్వాల్ వెళితే రూ.25 అయ్యే చార్జీ ఇకపై 35 కానుంది. మెట్రో డీలక్స్, ఈ మెట్రో, ఏసీ సర్వీసుల్లో కూడా మొదటి స్టేజీకి రూ.5 పెంపు, రెండో స్టేజీ నుంచి రూ.10 అదనంగా పెంచింది.
గ్రేటర్లో 2,800 బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. 30వేల ట్రిప్పులు కొనసాగుతున్నాయి. మహాలక్ష్మి ఉచిత బస్సు స్కీం రాకముందు గ్రేటర్లో రోజుకు 11 లక్షల మంది ప్రయాణం చేసేవారు. ఉచిత ప్రయాణం వచ్చాక రోజుకు 26 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఇందులో మహిళా ప్రయాణికులు సుమారు 16 లక్షల మంది ఉన్నారు. టికెట్ తీసుకుంటూ సుమారు 8 లక్షల మంది ప్రయాణం సాగిస్తున్నారు. ఈ లెక్కన వీరిపై అదనంగా కోటి రూపాయలకు పైగా రోజుకు భారం పడనుంది. ఒక్కో ప్యాసింజర్‌పై నెలకు రూ. 400-500 వరకు భారం పడనుంది. ఇటీవల పుష్పక్ బస్సుల చార్జీలను సైతం భారీగా పెంచింది.
మరోసారి ప్రయాణికులపై ఆర్టీసీ (Greater RTC) పిడుగు పడనున్నది. ఇప్పటికే విద్యార్థుల బస్ పాస్‌లు, టీ-24 టికెట్ చార్జీలు పెంచిన ఆర్టీసీ.. మరోసారి ప్రయాణికులపై భారం (Ticket fare Hike) మోపడానికి సిద్ధమైంది. మహాలక్ష్మి ఉచిత బస్సు పథకంతో ఆర్టీసీని లాభాల బాటలో చేశామని మాటలు నీళ్ల మూటలేనని తేలిపోయింది. ఏకంగా కనీస చార్జీపై 50 శాతం టికెట్ ధరలు పెరిగాయి. ఇప్పటి వరకు నగరంలో సిటీ బస్సు మొదటి స్టేజ్ ఫెయిర్ రూ.10 ఉంటే ఇప్పుడు రూ.5 పెంచుతూ రూ.15 చేశారు. ఇలా మొదటి మూడు స్టేజీలకు రూ.5 అదనంగా వసూలు చేయనున్నారు.
అనంతరం నాలుగో స్టేజీ నుంచి ఉన్న కనీస చార్జీపై అదనంగా రూ.10 వసూలు చేయనున్నారు. అంటే నాలుగో స్టేజీకి ఇప్పటి వరుక రూ.20 ఉంటే రూ.10 అదనంతో రూ.30గా నిర్ణయించారు. ఇలా గ్రేటర్ జోన్ పరిధిలో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ , ఈ-ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో పెరిగిన ధరలు అమలుకానున్నాయి. సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ టికెట్ ధరల పెంపు నిర్ణయంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థుల బస్‌పాస్‌ల ధరలను సైతం ఇటీవల ఆర్టీసీ పెంచడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. నెలవారి స్టూడెంట్ పాస్ రూ.400 ఉంటే ప్రస్తుతం 200 పెంచుతూ రూ. 600 చేశారు. తైమాసిక పాస్ 1200 ఉంటే ఇప్పుడు 1800 అయింది. గ్రేటర్లో 1.50లక్షల స్టూడెంట్ బస్ పాస్‌లున్నాయి. నెలవారీ రూ.400 ధరతో రూ.6 కోట్లు ఆర్టీసీకి ఆదాయం వస్తుంది. ఇప్పుడు పెరిగిన రూ.600తో 9 కోట్ల ఆదాయం వస్తుంది.
అదనంగా రూ.3 కోట్లు విద్యార్థులపై సర్కార్ భారం మోపిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, పుష్పక్ బస్సుల టికెట్ ధరలను సైతం పెంచి ప్రయాణికుల నడ్డి విరిచింది. విమానాశ్రయం వెళ్లే పుష్పక్ బస్సుల టికెట్ ధరలను గతంలో రూ.300 ఉంటే రూ.50 పెంచి రూ.350 చేసిన విషయం తెలిసిందే. టీ-24 చార్జీలను సైతం పెంచింది.
గ్రేటర్లో 2800 బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. 30వేల ట్రిప్పులు కొనసాగుతున్నాయి. మహాలక్ష్మి ఉచిత బస్సు స్కీం రాకముందు గ్రేటర్లో ఒక్క రోజుకు 11 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేసేవారని అధికారులు చెబుతున్నారు. ఉచిత ప్రయాణం వచ్చాక ఒక్క రోజుకు 26లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఇందులో మహిళా ప్రయాణికులు సుమారు 16 లక్షల మంది ఉన్నారు. కాగా, టికెట్ తీసుకుంటూ సుమారు 8 లక్షల మంది ప్రయాణం సాగిస్తున్నారు. ఈ లెక్కన వీరిపై అదనంగా కోటి రూపాయలకు పైగా రోజుకు భారం పడనుందని నిపుణులు చెబుతున్నారు.

ఇటీవలి వర్షాలకు నగర రోడ్లన్నీ అధ్వానంగా మారి ప్రయాణం నరకంలా మారింది. టోలిచౌకీ దర్గారోడ్డులో పడ్డ భారీ గుంతలో శనివారం ఆర్టీసీ ఈవీ బస్సు ఇలా దిగబడి చాలాసేపు మొరాయించింది.
