RTA | హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ట్రాన్స్పోర్ట్ నుంచి సేవలు పొందాలంటే జనాలకు చుక్కలు కనడుపడుతున్నాయి. ఏం చేయాలో తెలియక వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీఏ అధికారులు మాత్రం ఇవన్నీ చిన్నలోపాలేనని కొట్టిపారేస్తున్నారు. ప్రజలకు 40 రకాల ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు. ఆర్టీఏ సేవల్లో ప్రధానంగా డ్రైవింగ్ లైసెన్స్, వెహికిల్ రిజిస్ట్రేషన్, పర్మిట్లు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సర్టిఫికేట్ సంబంధించిన స్లాట్‌బుకింగ్ వంటివే ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వ వెబ్సైట్, కాల్‌సెంటర్ల నంబర్లు పనిచేయకపోవడంతో ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో దళారులను ఆశ్రయించాల్సి వస్తున్నది. ఇంకొందరు మీ-సేవ కేంద్రాల బాట పడుతున్నారు. ఇకనైనా ఆర్టీవో ఉన్నతాధికారులు స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వంలోని వివిధ విభాగాల మధ్యలో సమన్వయం లేకపోవడం వల్ల కూడా ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్టీఏ వ్యవహారంలోనూ అదే జరుగుతున్నదని తెలుస్తున్నది. రవాణాశాఖ, మీ-సేవపై రాష్ట్ర ఐటీ విభాగానికి జవాబుదారీ లేకపోవడంతోనే సేవలకు అంతరాయం కలుగుతున్నదని ప్రభుత్వ వర్గాలే విశ్వసనీయంగా చెప్తున్నాయి. ఈ పరిస్థితి మారకపోతే సమస్యకు పరిష్కారం దొరకదని, ప్రజలకు ఇబ్బందులు తప్పవని స్పష్టంచేస్తున్నారు.
హైదరాబాద్ నగరానికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి. డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం మీ-సేవ మొబైల్ యాప్ ద్వారా ప్రయత్నించాడు. సాంకేతిక సమస్యతో నిలిచిపోయింది. ల్యాప్‌టాప్ ద్వారా ఆర్టీఏ వెబ్సైట్ transport. telangana.gov.inలోకి వెళ్లి వివరాలు అందించాడు. యూపీఐ ద్వారా డబ్బులు చెల్లించాడు. కానీ గంటల తరబడి నగదు చెల్లింపు ప్రాసెస్‌లోనే ఉన్నట్టు చూపింది. అర్ధాంతరంగా సేవ నిలిచిపోయింది. స్లాట్‌బుకింగ్ నిర్ధారణ కాలేదు, నగదు చెల్లింపు రసీదు రాలేదు. కానీ ఆకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యాయి. స్క్రీన్‌పై కనిపించే 040-23370081/83/84 టోల్‌ఫ్రీ నంబర్లకు కాల్ చేస్తే ‘అవుటాఫ్ సర్వీస్’ అనే సమాధానం వస్తున్నది. దీంతో ఆర్టీఏ సేవల కోసం ప్రయత్నించేవాళ్లంతా తీవ్రఅసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.