ACB | మహబూబ్‌నగర్/నిజాంపేట/హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): అతడొక సాధారణ డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ (డీటీసీ). వేతనం నెలకు సుమారు రూ.2 లక్షలు. కానీ, అతని ఆస్తులు మాత్రం అక్షరాలా రూ.350 కోట్లకు పైమాటే. అతని డ్రైవర్ వేతనం నెలకు రూ.25 వేలే అయినా.. అతడి ఇల్లు ఓ ఇంద్రభవనమే. ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లాలో రవాణాశాఖలో డీటీసీగా విధులు నిర్వర్తిస్తున్న మూడ్ కిషన్‌నాయక్ ఇండ్లపై, అతను గతంలో పనిచేసిన ప్రదేశాల్లో మంగళవారం ఏసీబీ అధికారులు ఆకస్మికంగా సోదాలు చేపట్టారు. హైదరాబాద్ బోయిన్పల్లి, నిజామాబాద్ కంఠేశ్వర్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో ఈ సోదాలు జరిగాయి. ఏకకాలంలో కిషన్‌కు చెందిన బంధువులు, స్నేహితులు, కారు డ్రైవర్ ఇల్లుతో కలిపి 12 ప్రాంతాల్లో సోదాలు చేపట్టి భారీ ఎత్తున స్థిర, చరాస్తులను అధికారులు గుర్తించారు. ఈ సోదాల్లో అధికారికంగా రూ.12.72 కోట్ల అక్రమాస్తులు గుర్తించారు. అయితే, వాటి విలువ బహిరంగ మార్కెట్లో రూ.350 కోట్లకు పైనే ఉంటుందని ఉన్నతాధికారులు అంచనా వేశారు.
హైదరాబాద్ సోదాల్లో దొరికిన క్లూ..
ఇటీవల హైదరాబాద్‌లో ఓ ఆర్టీఏ అధికారిని ఏసీబీ సోదాల్లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రవాణాశాఖలో జరుగుతున్న అవినీతిపై పలువురిని ఏసీబీ ఆరాతీయగా మూడ్ కిషన్ గురించి తెలిసింది. అతనికి ఓ హోటల్లో వాటా మాత్రమే ఉందని ప్రాథమికంగా వెల్లడైంది. ఆ తర్వాత అతని గురించి లోతుగా అధ్యయనం చేయగా.. రవాణాశాఖలోనే అత్యంగా అవినీతి అనకొండగా పేరుగాంచినట్టు గుర్తించారు. అతని గురించి పూర్తి ఆధారాలు రహస్యంగా సేకరించిన తర్వాత.. మంగళవారం ఏకకాలంలో 12 ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లిలో ఉన్న కిషన్ నివాసంతోపాటు ఆయన బంధువులు, సన్నిహితులు, స్నేహితుల ఇండ్లను కూడా తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో నిందితుడు తన సర్వీసు కాలంలో అవినీతి అక్రమాలకు పాల్పడి, ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు.
కిలో బంగారం.. కోటిన్నర బ్యాంకు బ్యాలెన్సు..
మూడ్ కిషన్ ఆస్తులపై జరిగిన సోదాల్లో కిలోకు పైగా బంగారం బయటపడింది. బ్యాంకు బ్యాలెన్సు కోటిన్నరకు దగ్గరగా ఉంది. పదుల ఎకరాల్లో వ్యవసాయ భూమి, మరో 10 ఎకరాల వాణిజ్య భూమి, రెండు ప్లాట్లు.. హోటళ్లలో 50 శాతానికి పైగా ఓనర్షిప్, వ్యాపార సంస్థల్లో వాటాలు, పాలిహౌస్‌లు వెలుగులోకి వచ్చాయి. మూడ్ కిషన్‌కు చెందిన స్థిర, చరాస్తులపై ఏసీబీ అధికారులు ఇంకా లోతుగా ఆరా తీస్తున్నారు. బినామీల గురించి కూపీ లాగుతున్నారు. ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల డాక్యుమెంటెడ్ విలువ అధికారికంగా సుమారు రూ.12.72 కోట్లు కాగా.. బహిరంగ మారెట్లో రూ.350 కోట్ల వరకు ఉంటుందని అంచనా. నిందితుడిపై అవినీతి నిరోధక చట్టం 1988 (2018 సవరణ)లోని సెక్షన్ 13(1)(బీ), 13(2) కింద కేసులు నమోదు చేశారు.

కండ్లు చెదిరేలా డ్రైవర్ ఇల్లు..
మూడ్ కిషన్ దగ్గర కొన్నేండ్లుగా పనిచేస్తున్న డ్రైవర్ ఇల్లు చూసి ఏసీబీ అధికారులు విస్తుపోయినట్టు తెలిసింది. ప్రైవేట్ డ్రైవర్‌గా.. అతనికి వచ్చే నెల వేతనం కేవలం రూ.25వేలు మాత్రమే. కానీ అతడి ఇల్లు ఓ విల్లాను తలపించింది. అయితే అతడిని కిషన్‌కు బినామీగా ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. డ్రైవర్ పేరు మీదనే ఇన్నోవా క్రిస్టా కారు, హోండా సిటీ కారు ఉన్నట్టు గుర్తించారు. ఆఫీసులో డబ్బులు ముట్టుకోకుండా.. వ్యవహారమంతా డ్రైవర్‌తోనే నిర్వహిస్తాడని బాధితులు చెప్తున్నారు. మేడ్చల్, మెహదీపట్నంలో విధులు నిర్వర్తించినప్పుడు.. లంచాల కోసం వాహనదారులను పీక్కుతిన్నాడనే ఆరోపణ ఉంది. ఇదిలా ఉండగా, ఎవరైనా ప్రభుత్వ అధికారి లంచం డిమాండ్ చేస్తే వెంటనే తమ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు కోరారు. అలాగే వాట్సాప్ 9440446106, ఫేస్ బుక్ లేదా ఎక్స్ (ట్విట్టర్) ద్వారా కూడా తమను సంప్రదించవచ్చని, ఫిర్యాదుదారుల వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని ఏసీబీ డీజీ చారుసిన్హా తెలిపారు.
మూడ్ కిషన్‌కు చెందిన అక్రమాస్తుల వివరాలివే..
