హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): ప్రజా రవాణాలో భాగమైన పలు వాహనాల కదలికలను ఎప్పటికప్పుడు పసిగట్టేందుకు.. పోలీస్ కమాండ్ కంట్రోల్ తరహాలో ఆర్టీఏలో (RTA) కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఖైరతాబాద్‌లోని రవాణా కమిషనర్ కార్యాలయంలో ఈ సెంటర్ ఏర్పాటుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. మహిళా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని పటిష్ట నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని గతంలోనే ప్రతిపాదించారు. దీంతో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు, దాని పర్యావసానాలపై రవాణాశాఖ దృష్టి సారించింది.
‘వెహికల్ లోకేషన్ ట్రాకింగ్ వ్యవస్థ’ ద్వారా వాహనాల కదలికలను ఈ కమాండ్ కంట్రల్ సెంటర్ నుంచి నమోదు చేస్తారు. ఏవైనా ఇబ్బందిరకర పరిస్థితులు తలెత్తినప్పుడు ఆ వివరాల ఆధారంగా చర్యలు తీసుకొనేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ప్రయాణికుల భద్రతకు ప్రమాదం వాటిల్లినట్లు తెలిసినా వెంటనే అప్రమత్తమయ్యేందుకు అవకాశం ఉంటుందని ఆర్టీఏకు చెందిన అధికారులు చెప్పారు. ఆర్టీసీ బస్సులతోపాటు, ప్రైవేట్ బస్సులు, వ్యాన్లు, క్యాబ్‌లు, మ్యాక్సిక్యాబులు, మినీబస్సులు తదితర అన్ని కేటగిరీలకు చెందిన వాహనాలను ఆర్టీఏ నిఘా చట్రంలోకి తేనున్నారు. రవాణాశాఖలో నమోదైన ప్రతి ప్రజారవాణా వాహనాన్ని ఈజీగా ట్రాక్ చేసేందుకు ఈ సెంటర్ పని చేస్తుందని అధికారులు అంటున్నారు.
అయితే, వాహనాలు తయారు చేసే సమయంలోనే వాటికి తప్పనిసరిగా జీపీఎస్ ట్రాకింగ్ సదుపాయం కలిగిన డివైజ్‌లను ఏర్పాటు చేసేలా ప్రణాళికలు, ఆదేశాలు రూపొందిస్తున్నామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇప్పటికే కొన్ని రేటగిరీలకు చెందిన వాహనాలకు ఈ జీపీఎస్ ట్రాకింగ్ డివైజ్‌లు ఉన్నాయి. పాత వాహనాలకు కూడా ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసే అంశాలపై చర్చలు జరుగుతున్నాయని, ఈ అంశంలో సాధ్యాసాధ్యాలపై రవాణాశాఖ మంత్రి నేతృత్వంలో, ఉన్నతాధికారులతో కలిసి ఓ నిర్ణయం తీసుకుంటామని ఆ అధికారి తెలిపారు.