పరకాల, జూలై 7: ‘కాంగ్రెస్ ప్రజాపాలనలో మాట్లాడితే కేసులు, ప్రశ్నిస్తే జైలుకు.. ఇదెక్కడి సామాజిక న్యాయం’ అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. హనుమకొండ జిల్లా పరకాల మండలం మల్లక్కపేట గురుకులంలో 10వ తరగతి చదువుతూ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఏకు శ్రీవాణి సంతాపసభను సోమవారం పరకాలలో నిర్వహించగా, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి హాజరయ్యారు. ముందుగా బస్టాండ్ సెంటర్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో గురుకుల పాఠశాలల్లో సీట్లకు ఎంతో పోటీ ఉండేదని గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డి పాలనలో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణలేక, వసతులు కరువై గురుకులాలకు వెళ్లాలంటేనే విద్యార్థులు జంకుతున్నారని తెలిపారు.
గడిచిన 20 నెలల కాలంలో 97 మంది విద్యార్థులు మృతిచెందడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. ఒక్క గురుకులంలో 600 మంది విద్యార్థులను సరిగ్గా చూసుకోలేని ప్రభుత్వం.. ఇంటిగ్రేటెడ్ పాఠశాల్లో 2500 మంది విద్యార్థులను ఎలా చూసుకుంటుందో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనలో పూర్ణ, ఆనంద్కుమార్లాంటి ఎందరో విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరగా.. రేవంత్ పాలనలో నిరాహార దీక్షలుచేసే దుస్థితి దాపురించిందని మండిపడ్డారు. విద్యాశాఖను తన దగ్గరే పెట్టుకున్న సీఎం.. గురుకుల విద్యార్థుల చేత వంట పనులు చేయించడం.. టాయిలెట్స్ కడిగిస్తున్నారని విమర్శించారు.
రేవంత్‌రెడ్డి తన ఇంట్లో పిల్లలతో ఇలాంటి పనులు చేయిస్తారా..? అని ప్రశ్నించారు. ఇటీవల రాష్ర్టానికి వచ్చిన ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే సామాజిక న్యాయపోరాటానికి సిద్ధం కావాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారని, తెలంగాణలో మాట్లాడితే కేసులు పెడుతున్నారని, ప్రశ్నిస్తే జైలుకు పంపుతున్నారని ..ఇదేనా సామాజిక న్యాయం అని ప్రశ్నించారు. ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, ఆ హక్కు కోసం రాష్ట్రంలో పోరాడాల్సిన దుస్థితి నెలకొందని మండిపడ్డారు. గురుకులాల్లో విషాహారంతో ఎంతోమంది విద్యార్థులు అనారోగ్యం పాలైన ఘటనపై ప్రశ్నిస్తే .. ప్రవీణ్‌కుమార్ పెంచిన గూండాలే కారణమని కొండా సురేఖ ఆరోపించారని ధ్వజమెత్తారు. గూండాలను తయారుచేసి, గ్యాంగులను ప్రోత్సహిస్తున్నది కొండాయే అని స్పష్టంచేశారు. స్థానికసంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సర్కారుకు బుద్ధిచెప్పి బంగారు తెలంగాణ సాధించడానికి అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.