హైదరాబాద్, మే 9(నమస్తే తెలంగాణ): కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్ సుద్దపూసేం కాదు.. హనీట్రాప్ చేయడానికి జేమ్స్‌బాండ్ 007 అంతకన్నా కాదు.. అతడు ఖైదీ నంబర్ 786 అని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ‘బండి సాయిభగీరథ్‌పై మహేంద్ర యూనివర్సిటీలో రెండు ర్యాగింగ్ కేసులు ఉన్నాయి, తాజాగా పేట్ బషీరాబాద్ ఠాణాలో పోక్సో కేసు నమోదైంది. 17 ఏళ్ల బాలికపై మూడుసార్లు లైంగిక దాడికి యత్నించాడు. న్యూ ఇయర్ సందర్భంగా మత్తు మందు కలిపి లైంగికదాడికి యత్నించారు’ అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కానీ దొంగేదొంగ అన్న చందంగా బాలిక కుటుంబం నుంచి తనకు ప్రాణహాని ఉన్నదని బండి సంజయ్ కొడుకు కరీంనగర్ ఠాణాలో ఫిర్యాదు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ‘ఉన్నత కుటుంబానికి చెందిన మైనర్ తల్లిదండ్రులు రూ.50వేలు తీసుకుంటారా? అయినా 17ఏండ్ల బాలికకు కేంద్ర మంత్రి కొడుకు భయపడతాడా? ఎవరైనా నమ్ముతారా?’ అంటూ ప్రశ్నించారు.
అనేక కేసులు, లైంగిక ఆరోపణలున్న కొడుకును కేంద్ర మంత్రి వెనుకేసుకురావడంలో అంతర్యమేమిటని నిలదీశారు. శనివారం తెలంగాణ భవన్లో ప్రవీణ్‌కుమార్ విలేకరులతో మాట్లాడారు. 15 రోజుల నుంచి తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆందోళన వ్యక్తంచేశారు. మొన్న జూబ్లీహిల్స్ ఏరియాలో రిటైర్డ్ ఐపీఎస్ భార్యను హతమార్చిన నిందితులు, కరీంనగర్ పీఎంజే గోల్డ్‌షాపులో దోపిడీ దొంగలను ఇంతవరకు పట్టుకోకపోవడం.. మల్కాజిగిరి మహిళా ఏసీపీని 40మంది ఆకతాయిలు వేధించడం చూస్తే రాష్ట్రంలోని గాడి తప్పిన లా అండ్ ఆర్డర్‌కు అద్దంపడుతున్నదని మండిపడ్డారు. ఈ పరిస్థితుల్లో బండి సంజయ్ కొడుకు భగీరథ్ కొడుకు లీలలు బయటకు రావడం కలంకలం రేపిందన్నారు. ఆయనపై మైనర్ బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ ఠాణాలో పోక్సో కేసు నమోదైందని తెలిపారు. అక్కడ కేసు నమోదైన వెంటనే భగీరథ్ ఫిర్యాదు మేరకు బాలికపై కరీంనగర్ టౌటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం విడ్డూరంగా ఉన్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
బండి కొడుక్కో న్యాయం.. బాలికకో న్యాయమా?
పేట్‌బషీరాబాద్ స్టేషన్‌కు వెళ్లిన బాలిక తల్లిదండ్రులను పోలీసులు ఎనిమిది గంటలు పోలీస్‌స్టేషన్‌లో కూర్చోబెట్టడం శోచనీయమని ప్రవీణ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బండి సంజయ్ ఒత్తిడితోనే కరీంనగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ రికార్డు చేశారని ఆరోపించారు. అంటే బాలిక తల్లిదండ్రులకు ఓ న్యాయం? బండి కొడుక్కు ఇంకో న్యాయం? బోధన్ మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ కొడుక్కి మరో న్యాయమా? అని ప్రశ్నించారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు బీఎన్ఎస్-183 కింద మైనర్ తల్లి స్టేట్మెంట్ ఎందుకు రికార్డు చేయలేదు? స్టేషన్ బెయిల్ పొందేలా సెక్షన్లు ఎందుకు పెట్టారు? బండి, రేవంత్‌రెడ్డి, కిషన్‌రెడ్డికి అవినాభావ సంబంధం ఉన్నదనే విస్మరించరా? అని పోలీసులను నిలదీశారు. కేసు విత్‌డ్రా చేసుకోవాలని బీజేపీలో ఉన్న మాజీ జర్నలిస్ట్ బాలిక తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోదీ పక్కన కూర్చుంటున్న సంజయ్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని నిలదీశారు.
మోదీ, మహిళలు నోరు విప్పాలి..
బండి సంజయ్ కుమారుడి లీలలపై ఆ పార్టీ మహిళా నేతలు స్పందించాలని, హైదరాబాద్‌కు వస్తున్న ప్రధాని మోదీ నోరు విప్పాలని ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. లేదంటే బీజేపీ భేటీ బచావో.. భేటీ పడావో నినాదం ఉత్తదేనని ప్రజలు అర్థం చేసుకుంటారని స్పష్టంచేశారు.
రేవంత్‌రెడ్డి సిట్ వేస్తారా? సీబీఐకి సిఫార్సు చేస్తారా?
బీఆర్ఎస్ నేతలపై చీటికిమాటికి సిట్ అంటూ లేచే సీఎం రేవంత్‌రెడ్డి.. బండి కొడుకు వ్యవహారంపై మౌనంలో ఆంతర్యమేంటని ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. భగీరథ్ లీలలపై సిట్ వేయాలని, లేదా సీబీఐ విచారణకు సిఫార్సు చేయాలని కోరారు. హనీట్రాప్ చేయడానికి భగీరథ్ జేమ్స్‌బాండ్ కాదు బీజేపోళ్లకు అసలు తెలివి ఉందో లేదు. ఇంత చిన్నోళ్లపై హనీ ట్రాప్ చేయరు. ఎక్కడైనా గూఢచారుల మీద హనీట్రాప్ వేస్తారు. దేశ భద్రత, అంతర్గత రహస్యాలు, న్యూక్లియర్ రహస్యాలను తెలుసుకొనేందుకు శత్రుదేశాలు మహిళలను పంపి కాంప్రమైజింగ్ ఫొటోలు, వీడియోలు తీసుకొని బ్లాక్మెయిల్ చేయడం హనీట్రాప్. హనీట్రాప్ చేయడానికి బండి సంజయ్ కొడుకేం జేమ్స్‌బాండ్ 007 కాదు.. ఖైదీ నంబర్ 786. ఏ1, ఏ2లు వాళ్లు.. ఇప్పటికైనా బీజేపీ మహిళా నాయకులు బండి సంజయ్, భగీరథ్‌తో బాలికకు క్షమాపణ చెప్పించాలి.