షాబాద్, సెప్టెంబర్ 11: సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో టీజీపీఏస్సీ భ్రష్టు పట్టిందని బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. ఉద్యోగుల ట్రాన్స్‌ఫర్‌కు రూ.30 లక్షలు, గ్రూప్-1 పోస్ట్‌కు రూ.3 కోట్లు నడుస్తున్నదని నిరుద్యోగ అభ్యర్థులు ఆరోపిస్తున్నారని తెలిపారు. మొత్తం 563 గ్రూప్ -1 పోస్టులకు గాను రూ.1700 కోట్ల కుంభకోణం జరిగిందని నిరుద్యోగులు మండిపడుతున్నారని చెప్పారు. గురువారం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలోని స్టార్ గార్డెన్లో మాజీ జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డితో కలిసి ఆర్‌ఎస్‌ప్రవీణ్‌కుమార్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి హోంమంత్రి సబితారెడ్డి విద్యార్థుల కోసం మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారని తెలిపారు. ఆ సమయంలో తాను డీఐజీగా ఉన్నానని, హోంమంత్రిగా సబితారెడ్డి లేకపోతే ఎందరో విద్యార్థులు ప్రాణాలు కోల్పోయేవారని చెప్పారు. ఇటీవల గురుకులాల్లో 105 మంది పిల్లలు చనిపోతే ఏ ఒక్క పిల్లవాడి ఇంటికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పోలేదని మండిపడ్డారు.