నాగర్‌కర్నూల్ : ఎంపీగా అవకాశం కల్పిస్తే నాగర్‌కర్నూల్(Nagarkurnool) వాణి ఢిల్లీలో వినిపిస్తానని, పేద ప్రజల అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేసి చూపిస్తానని నాగర్‌కర్నూల్ పార్లమెంట్ బీఆర్ఎస్(BRS) అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) అన్నారు. బుధవారం వనపర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, సీనియర్ నాయకుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇంతకుముందు ఇక్కడి నుంచి ఎన్నికైన ఎంపీలంతా పార్లమెంట్లో మౌనంగా ఉన్నారు.
ఇలాంటి వ్యక్తుల వల్ల నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలందరికి నష్టం కలుగుతుందన్నారు మల్లురవి, పోతుగంటి భరత్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో పని చేయడం గర్వంగా ఉందన్నారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని, వెయ్యి గురుకులాలను ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని ప్రశ్నించారు.
గురుకులాల ద్వారా లక్షలాది మంది పేద విద్యార్థులు ప్రపంచ స్థాయిలో చదువుకొని ఉద్యోగాలు చేస్తు న్నారని గుర్తు చేశారు. తెలంగాణ గురుకులాల గురించి అమెరికాలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోనూ పాఠం ఉందంటే అది నాటి సీఎం కేసీఆర్ ప్రత్యేకత అన్నారు. అబద్ధపు ప్రచారాలను నమ్మవద్దు.. అప్రమత్తంగా ఉండి పార్లమెంట్ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.