హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): అధికారులను పావులుగా చేసుకొని ప్రతిపక్ష నేతలను సీఎం రేవంత్‌రెడ్డి వేధింపులకు గురిచేస్తున్నారని బీఆర్ఎస్ నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. ఏదైనా చేసి మాజీ మంత్రి హరీశ్‌రావును ఇరికించాలని విశ్వప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. హరీశ్‌రావును ఎంతగా వేధించినా ప్రజల పక్షానే ఉంటారని స్పష్టంచేశారు. సీఎం ఒత్తిడి చేసినంత మాత్రాన ఐపీఎస్ అధికారులు పక్షపాతంతో వ్యవహరిస్తారా? అని ప్రశ్నించారు. ఒత్తిడికి తలొగ్గలేమని చెప్పి అధికారులు ఉద్యోగాలను వదిలివేయడం మంచిదని హితవుపలికారు. తెలంగాణలో అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయని ప్రవీణ్‌కుమార్ తెలంగాణ భవన్లో మండిపడ్డారు. హరీశ్‌రావుపై చక్రధర్ అనే క్రిమినల్‌తో పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో తప్పుడు కేసులు పెట్టించారని ఆరోపించారు. చక్రధర్‌పై అనేక కేసులు ఉన్నాయని తెలిపారు. లైంగిక దాడి, 1900 మందిని ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన కేసు, కిడ్నాప్ కేసు కూడా చక్రధర్‌పై ఉన్నదని గుర్తుచేశారు. ఇది ఆరోపణ కాదని, తన ఎన్నికల అఫిడవిట్లోనే చక్రధర్ పేర్కొన్నారని వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో వంశీకృష్ణ ఇచ్చిన అఫిడవిట్లో పోలీసుల తీరుపై అనేక ఆరోపణలు చేశారని, వాటిని తీవ్రంగా పరిగణించాలని, డీసీపీ విజయ్‌కుమార్, ఏసీపీ మోహన్‌కుమార్ వైఖరి ఖండించదగినదని పేర్కొన్నారు.
హరీశ్‌రావుపై అక్రమ కేసులు
ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చి వాటిని ఎగ్గొట్టినందుకు ఎనుముల రేవంత్‌రెడ్డి కాదు.. ఎగవేతల రేవంత్‌రెడ్డి అని విమర్శించినందు కు మానకొండూరు పీఎస్‌లో హరీశ్‌రావుపై కేసు పెట్టారని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. యాదాద్రిలో దేవుడిపై ఒట్టేసి రుణమాఫీ హామీని రేవంత్ నిలుపుకోనందుకు హరీశ్‌రావు ప్రశ్నిస్తే అకడ కూడా కేసు పెట్టారని మండిపడ్డారు. ఇలా చిన్నచిన్న అంశాల్లో హరీశ్‌రావుపై కేసులు పెడుతున్నారని, పోలీసు ఉన్నతాధికారులు కూడా రేవంత్ అడుగులకు మడుగులొత్తుతున్నారని ఆరోపించారు. తాను కూడా ఐపీఎస్ అధికారిగా పనిచేశానని చెప్పారు. సీఎంలు ఒత్తిడి చేసినంత మాత్రాన ఐపీఎస్ అధికారి పక్షపాతంతో వ్యవహరిస్తా రా? అని ప్రశ్నించారు. ఒత్తిడికి తలొగ్గలేమని చెప్పి విజయ్‌కుమార్‌లాంటి వాళ్లు ఉద్యోగాలను వదిలివేయడం మంచిదని హితవుపలికారు. కాంగ్రెస్ నేతలపై తాము ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేయడం లేదని మండిపడ్డారు. కానీ, కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేసిన వెంటనే బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వెళ్లిన పాడి కౌశిక్‌రెడ్డి, ఎరోళ్ల శ్రీనివాస్‌పై కేసులు పెట్టారని, కేటీఆర్ కార్యకర్తలతో ఈడీ కార్యాలయ వద్ద రోడ్డుపై నడుచుకుంటూ వస్తే కేసులు పెట్టారని, బీఆర్ఎస్ నేతలపై ఎందుకింత కక్ష? అని నిలదీశారు. కేసీఆర్ హయాం లో ఇలా ఎపుడూ జరగలేదని అన్నారు. అక్రమ కేసులు ఎన్ని పెట్టినా ఎదురొనే సత్తా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నదని స్పష్టంచేశారు.