హైదరాబాద్, ఆగస్టు 29, (నమస్తే తెలంగాణ): ‘రేవంత్‌రెడ్డి హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఆటవిక, అరాచక పాలన కొనసాగుతున్నది’ అని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. డీజీపీ మాత్రం శాంతిభద్రతలు కంట్రోల్లోనే ఉన్నాయంటూ కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో రౌడీగ్యాంగ్‌లు స్వైరవిహారం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. వచ్చేది బీఆర్ఎస్ 0.3 ప్రభుత్వాన్ని చూస్తారని, ఇప్పుడు ప్రభుత్వానికి ఊడిగం చేస్తూ అరాచకం సృష్టిస్తున్న అధికారులకు, కల్లోలం సృష్టిస్తున్న నేతలకు తమ ప్రభుత్వ హయాంలో చుక్కలు చూపిస్తామని హెచ్చరించారు.
ఈ నెల 20న మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన జీరో ఎఫ్ఐఆర్ వివరాలను ప్రవీణ్‌కుమార్ మీడియాకు వెల్లడించారు. మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్.. మేడ్చల్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి హరికృష్ణను జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద ఉన్న ఒక డెన్‌కు పిలిపించి రాడ్లతో దాడి చేసి చంపేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. తీవ్రగాయాలైన బాధితుడిని దవాఖానకు పంపకుండా పోలీస్‌స్టేషన్‌లోనే నిర్బంధించారని, ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పరిధిలో జరిగితే మేడిపల్లిలో కేసు ఎలా బుక్ అవుతుందని ఆయన ప్రశ్నించారు. సీఎంపై కొండా సుస్మిత విమర్శలకు దిగగానే ఈ కేసును ఎందుకు ముందుకు తీసుకోచ్చారో తెలంగాణ ప్రజలందరికీ తెలుసునని, ప్రభుత్వం ఈ కేసును రాజకీయ లబ్ధికి వాడుకొంటున్నదని తెలిపారు.
కిందిస్థాయి పోలీసులే బలి
సీఎం రాజకీయ చదరంగంలో కిందిస్థాయి అధికారులు, ముఖ్యంగా బహుజన వర్గానికి చెందిన అధికారులే బలైపోతున్నారని ప్రవీణ్‌కుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. జూబ్లీహిల్స్‌లో బాధ్యతలు చేపట్టిన వారం రోజులకే సీఐ ముత్తుయాదవ్ను అకారణంగా సస్పెండ్ చేశారని, కానీ ఘటనకు బాధ్యులైన డీసీపీ రమణారెడ్డి, ఏసీపీ వెంకట్‌రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని నిలదీశారు. అలాగే చిట్యాలలో ఒక విలేకరిపై దాడికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసినందుకు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సీఐ మల్లేశ్‌ను సస్పెండ్ చేశారని గుర్తుచేశారు. తన మీద, తన పిల్లల మీద తప్పుడు ప్రసారాలు చేసిన ఒక చానల్‌పై అడిషనల్ డీజీ హోదాలో రిటైరైన తాను స్వయంగా వెళ్లి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని మండిపడ్డారు.
పోలీస్ వ్యవస్థలో తీవ్ర ఒత్తిళ్లు
రాష్ట్రంలో పోలీసుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని, రేవంత్ పాలనలోని ఒత్తిడి తట్టుకోలేక కొందరు పోలీస్ అధికారులు ప్రాణాలు తీసుకుంటున్నారని ప్రవీణ్ కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. ఇటీవల ఎల్బీనగర్లో ఒక కానిస్టేబుల్, డీజీపీ కార్యాలయంలో మరో కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం ఒత్తిళ్లకు నిదర్శనమని పేర్కొన్నారు. మహిళా కానిస్టేబుళ్లకు, ఎస్సైలకు కనీస సౌకర్యాలైన టాయిలెట్లు నిర్మించకుండా, సీఎం తన సభల కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. పోలీస్ శాఖలో బాధిత అధికారులెందరో తనను ప్రత్యక్షంగా కలిసి, తనకు నిత్యం ఫోన్లు చేసి, మెసేజ్‌లు పెడుతూ తమ సమస్యలపై గళమెత్తాలని అడుగుతున్నారని తెలిపారు.
రేవంత్‌రెడ్డి మిత్రుల మితిమీరిన జోక్యం
జూబ్లీహిల్స్ దాడి ఘటన వెనుక సీఎం ఆప్తులు, మిత్రులు ఉన్నారని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. బాధితుడిని కొడుతున్న సమయంలో ఎవరికో వీడియో కాల్ చేసి చూపించారని, ట్రూకాలర్‌లో పీఏ టు రేవంత్‌రెడ్డి అని రాసుకునే కిరణ్ అనే వ్యక్తికి ఈ ఘటనతో ఉన్న సంబంధం ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకుల గన్మెన్లను, సెక్యూరిటీని తొలగిస్తూ, ఏ అధికార హోదా లేని జానారెడ్డికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, ప్రొటోకాల్ భద్రత ఎలా కల్పిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి జోగు రామన్నకు ఎందుకు గన్మెన్లను ఇవ్వలేదని ప్రశ్నించారు.
సిట్ ఏర్పాటు చేయాలి
జూబ్లీహిల్స్ దాడి ఘటన, పోలీస్ అధికారుల అక్రమ సస్పెన్షన్లు, మంత్రి ఓఎస్డీ సుమంత్ అరాచకాలపై తక్షణమే ప్రత్యేక విచారణ బృందం ((సిట్) ఏర్పాటుచేసి నిష్పాక్షిక విచారణ జరిపించాలని ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. సస్పెండ్ అయిన సీఐ ముత్తుయాదవ్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, సుమంత్‌ను వెంటనే అరెస్టు చేయాలని కోరారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఒక ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటుచేసి, పోలీస్ వ్యవస్థపై జరిగిన రాజకీయ ఒత్తిళ్లు, అక్రమాలపై సమగ్ర విచారణ జరుపుతామని హెచ్చరించారు. సమావేశంలో బీసీ కమీషన్ మాజీ సభ్యుడు ఉపేంద్రాచారి, బీఆర్ఎస్ నాయకులు కిశోర్‌గౌడ్, కల్వకుర్తి శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.