హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): జైలులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తూ తోటి ఖైదీ దాడిలో మృతిచెందిన మరో ఖైదీ భార్యకు 6% వడ్డీతో రూ.7.20 లక్షల పరిహారం చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే.. 2012 జూలై 4న చర్లపల్లి జైలులో దాసరి నరసింహులు అనే ఖైదీ దాడిలో ఐదుగురు ఖైదీలు గాయపడ్డారు. వారినిలో మెదక్ జిల్లాకు చెందిన కరోళ్ల వెంకయ్య అనే ఖైదీ గాంధీ దవాఖానలో చికిత్స పొందుతూ మరణించడంతో మానవహక్కుల కమిషన్ ఆదేశం ప్రకారం ఆయన భార్య జయమ్మకు 2018లో ప్రభుత్వం లక్ష రూపాయల పరిహారాన్ని అందజేసింది. అనంతరం ఆమె 10 లక్షల రూపాయల పరిహారాన్ని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జయమ్మకు ఏటా రూ.57,600 చొప్పున గత 11 సంవత్సరాలకు కలిపి రూ.6,33,600తోపాటు అంత్యక్రియలు, ఇతర ఖర్చుల కింద మరో రూ.84 వేలు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందులో ఇప్పటికే చెల్లించిన రూ.లక్షను మినహాయించి మిగిలిన మొత్తాన్ని 6% వడ్డీతో చెల్లించాలని జస్టిస్ సీవీ భాసర్రెడ్డి ఇటీవల తీర్పు ఇచ్చారు.