(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): కర్ణాటకలో అట్టపెట్టెల్లో 42 కోట్ల అక్రమ సొమ్ముతో అడ్డంగా దొరికిపోయిన స్కాంగ్రెస్.. రాజస్థాన్ ఎన్నికల్లోనూ ఇదే తరహా కుట్రకు తెరతీసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ ఎంపీ కిరోడి లాల్ మీనా శుక్రవారం చేసిన సంచలన ఆరోపణలు ఈ వాదనకు మరింత బలాన్ని ఇస్తున్నాయి. జైపూర్లోని ఎంఐ రోడ్డులో ఉన్న గణపతి ప్లాజాలోని ఓ ఫ్లాట్లో 100 ప్రైవేట్ లాకర్లు ఉన్నాయని, వాటిలో రూ.500 కోట్ల నల్లధనం, 50 కిలోల బంగారం ఉన్నదని కిరోడి లాల్ మీనా ఆరోపించారు. పోలీసులు ఈ లాకర్లను తెరవాలని డిమాండ్ చేశారు. లాకర్లు తెరిచేవరకు తాను గేటు వద్దే కూర్చొని ధర్నా చేస్తానని ప్రకటించారు. లాకర్లు ఉన్న గదిని మీడియాకు చూపించారు. అయితే, శుక్రవారం రాత్రివరకూ ఆ లాకర్లను తెరువడానికి రాజస్థాన్ పోలీసులు రాకపోవడం గమనార్హం. కిరోడి మీనా రానున్న రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో సవాయ్ మాధోపూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. రాజస్థాన్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే.
పేపర్ లీక్ స్కామ్ సొమ్మే
లాకర్లు ఉన్న గది ముందు మీడియాతో మాట్లాడిన కిరోడి.. లాకర్లు ఎవరివనే వివరాలు ఇప్పుడే బయటపెడితే.. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా వాటిని తెరవనివ్వరని తొలుత చెప్పారు. అయితే, జాతీయ మీడియా ‘న్యూస్18 హిందీ’తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. లాకర్లలో ఉన్నదంతా అధికార కాంగ్రెస్కు చెందిన డజనుకు పైగా ఎమ్మెల్యేలు, ఆరేడు మంది మంత్రులకు చెందిన అవినీతి సొమ్మేనని ఆరోపించారు. పేపర్ లీక్, జల్జీవన్ మిషన్లో అక్రమంగా దోచుకొన్న సొమ్మే ఇక్కడ దాచుకొన్నట్టు మండిపడ్డారు. పదేండ్లయినా లాకర్లను ఇప్పటివరకూ తెరువలేదని ధ్వజమెత్తిన కిరోడి.. చట్టబద్ధ సొమ్మయితే, ప్రైవేటు లాకర్లలో ఎందుకు దాచుకోవాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో పంచేందుకే ఈ సొమ్మును ఇక్కడ నిల్వ చేసినట్టు ఆరోపించారు.