హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 24 (నమస్తే తెలంగాణ): మిస్సింగ్ కేసులో అనుమానితుడి పేరు తీసేసేందుకు రూ. 50 వేలు లంచం డిమాండ్ చేసి ఏసీబీకి దొరికిన షాహినాయథ్గంజ్ మాజీ ఇన్స్పెక్టర్ బాలుచౌహాన్ను శుక్రవారం అరెస్ట్ చేశారు. షాహియనాయథ్గంజ్ పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్గా బాలుచౌహాన్ పనిచేస్తున్న సమయంలో మిస్సింగ్ కేసు నమోదయ్యింది. ఆ కేసులో అనుమానితులతో సీఐ చేతులు కలిపారు. మిస్సింగ్ కేసులో నుంచి పేరు తీయడంతోపాటు వేధింపులు లేకుండా చేయాలంటే రూ. 1.5 లక్షలు ఇవ్వాలని సీఐ డిమాండ్ చేశారు. ఆ తరువాత రూ. 50 వేలు తగ్గించి లక్షకు ఒప్పందం చేసుకోగా బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ బాలుచౌహాన్ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి ప్రయత్నించడంతో పారిపోయాడు. ఏసీబీ ఈ విషయాన్ని హైదరాబాద్ సీపీ దృష్టికి తీసికెళ్లింది. దీంతో బాలుచౌహాన్ను బదిలీ చేస్తూ, ఆయన స్థానంలో కొత్తవారిని నియమిస్తూ సీపీ ఉత్తర్వులు జారీచేశారు. 15 రోజులుగా బాలుచౌహాన్ అజ్ఞాతంలోనే ఉన్నాడు. శుక్రవారం బాలు ఆచూకీ తెలియడంతో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి, కోర్డులో హాజరుపరిచారు.
3558 కేజీల గంజాయి కాల్చివేత
హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో 303 కేసుల్లో పట్టుబడిన 3,558 కేజీల డ్రగ్స్‌ను కాల్చివేసినట్టు రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. కాల్చివేసిన డ్రగ్స్, గంజాయి విలువ రూ. 14.60కోట్లుగా ఉంటుందని పేర్కొన్నారు. ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో 10,596 కేజీల గంజాయి నిల్వలున్నాయని వెల్లడించారు. ఈ మొత్తాన్ని జనవరిలోపు డిస్పోజల్ చేయడానికి కసరత్తు చేపట్టినట్టు పేర్కొన్నారు.