హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ (బీఏఎస్) పథకం కూడా ప్రశ్నార్థకంగా మారింది. ప్రైవేట్ స్కూళ్లకు సర్కారు రూ. 210 కోట్లు బాకీపడింది. నిధులు చెల్లించకుండా పథకం అమలు చేయడం కుదరదని పాఠశాల యాజమాన్యాలు స్పష్టంచేశాయి. దీంతో 25వేల మంది విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిందని, ప్రభుత్వం నుంచి స్పందన కరువైందని, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తలు మండిపడుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం.. విద్యపై నిర్లక్ష్యం
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రైవేట్, కార్పొరేట్ విద్యను ఉచిత అందించడం కోసం 17 ఏండ్లుగా ప్రభుత్వాలు బెస్ట్ అవైలబుల్ స్కూల్’ స్కీమ్ అమలు చేస్తున్నాయి. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖలు నోటిఫికేషన్ జారీచేసి, విద్యార్థులను ఎంపిక చేసి, అదే జిల్లాలోని ప్రైవేట్ స్కూళ్లల్లో చదివిస్తాయి. ఎస్సీ విద్యార్థులకు 1వ, 5వ తరగతిలో, ఎస్టీ విద్యార్థులకు 1వ, 5వ, 8వ తరగతుల్లో ప్రభుత్వమే ప్రవేశాలు కల్పిస్తుంది. ఒకసారి ప్రవేశం పొందితే పదో తరగతి వరకు వారి ఫీజులు చెల్లిస్తుంది. ప్రాథమిక పాఠశాల విద్యార్థికి ఏడాదికి రూ.28,000లు, ఉన్నత పాఠశాల విద్యార్థికి ఏడాదికి, వసతితో కలిపి రూ.42,000లు చెల్లిస్తుంది. పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, స్కూల్ యూనిఫాం ఉచితంగా అందిస్తుంది. ఇప్పటికే ఈ స్కీమ్ కింద 17వేల మంది ఎస్సీ, 8వేల మంది ఎస్టీ విద్యార్థులు వివిధ తరగతుల్లో చదువుకుంటున్నారు.
ఏడాదిన్నరగా చెల్లింపులు సున్నా
బెస్ట్ అవలైబుల్ స్కీమ్‌కు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నరగా ప్రైవేటు పాఠశాలలకు రూ.210కోట్ల నిధులను చెల్లించకుండా బకాయిలు పెట్టింది. ప్రైవేట్ పాఠశాలల యజమానులు చాలాసార్లు ప్రభుత్వ పెద్దలను కలిసి, ఫీజులు చెల్లించాలని కోరారు. కానీ ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. గతంలో అడ్మిషన్ పొందిన విద్యార్థులను స్కూల్స్, హాస్టల్స్ నుంచి పంపించాలని నిర్ణయించారు.
నిధులివ్వకుంటే అడ్మిషన్లు తీసుకోం
బెస్ట్ అవలైబుల్ స్కీమ్ నిధులను ప్రభుత్వం బకాయి పెట్టింది. ఆర్థిక ఇబ్బందులతో పాఠశాలలను నిర్వహించలేకపోతున్నాం. ప్రభుత్వ పెద్దలను ఎన్నిసార్లు కలిసి విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయింది. అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం తక్షణం నిధులను విడుదల చేయకుంటే ఈ విద్యాసంవత్సరం నుంచి ఈ స్కీమ్ కింద అడ్మిషన్లను తీసుకునే ప్రసక్తేలేదు.
-శేఖర్‌రావు, బీఏఎస్ పాఠశాలల సంఘం రాష్ట్ర కార్యదర్శి