హైదరాబాద్, మే 20: లాభాల ఎరచూపి ప్రజల నుంచి రూ.10 కోట్లు సేకరించిన ఓ సంస్థ ఆ తర్వాత బోర్డు తిప్పేసింది. మోసపోయినట్టు గుర్తించిన బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేయగా, ప్రధాన నిందితులు పరారీలో ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. బీఎన్ సతీశ్, ఏ వెంకట చలపతి కలిసి 2015లో బెంగళూరులో ‘జైటో కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్’ను స్థాపించారు. ఆ తర్వాత గుడిరాజు రాజేంద్రప్రసాద్రాజు, గురుప్రసాద్, పాశం వెంకట్ ప్రసాద్, జ్యోతి కలిసి కేపీహెచ్బీలో ఆ సంస్థ శాఖను ప్రారంభించారు.
అనంతరం ఎక్స్సీపీఎల్ డాట్ కామ్ పేరుతో వెబ్సైట్ ప్రారంభించిన నిందితులు తమ కంపెనీలో పెట్టుబడి పెడితే 3 నెల ల్లో 1:1, సంవత్సరానికి 1:4 చొప్పున లాభాలు ఇస్తామని నమ్మించారు. వారి మాయమాటలు నమ్మిన ఏపీ, తెలంగాణకు చెందిన 500 మంది దాదాపు రూ. 10 కోట్ల పెట్టుబడులు పెట్టారు. టీ రాజేంద్రపసాద్ రూ.6.5 లక్షలు పెట్టుబడిగా పెట్టారు. డబ్బులు పెట్టుబడి పెట్టి నెలలు గడుస్తున్నా లాభాల మాట లేకపోవడంతో మోసపోయామని గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో మోసం వెలుగు చూసింది. కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు శనివారం గాదిరాజు రాజేంద్రప్రసాద్రాజు(29), పాశం వెంకట్ ప్రసాద్(28), ఏ వెంకట చలపతి (48)లను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడైన బీఎన్ సతీశ్, గురుప్రసాద్, జ్యోతి పరారీలో ఉన్నారు.