కూసుమంచి, సెప్టెంబర్ 23: కలర్ ప్రింటర్‌తో నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలు తయారు చేస్తూ వాటిని రైతులకు అంటగడుతున్న ముఠాగుట్టు ఓ బాధిత రైతు ఫిర్యాదుతో రట్టయింది. కూసుమంచి ఎస్సై నాగరాజు, బాధిత రైతుల కథనం ప్రకారం.. కూసుమంచి మండలం జక్కేపల్లికి చెందిన కొత్తా జీవన్‌రెడ్డి.. ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాలకు చెందిన మరో నలుగురు కలిసి ముఠాగా ఏర్పడ్డారు. పట్టాదారు పాస్ పుస్తకాలు రాని, వివాదాస్పద భూములపై కన్నేసి, సదరు రైతులను కలిసి హైదరాబాద్‌లోని సీసీఎల్ఏలో తమకు తెలిసిన వారు ఉన్నారని, వారి ద్వారా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పిస్తామని నమ్మబలికేవారు. ఈక్రమంలో జక్కేపల్లిలో పలువురు నుంచి కోట్లల్లో వసూలు చేశారు. కాగా, మోసపోయామని గ్రహించిన బాధిత రైతులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.