Group-2 | హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): గ్రూప్-2 పరీక్షల సమయంలోనే రైల్వే రిక్రూట్‌మెంట్‌బోర్డు(ఆర్ఆర్బీ) పరీక్షలున్నాయి. ఒకే రోజు రెండు పరీక్షలుండటంతో ఏ పరీ క్ష రాయలో తెలియక అభ్యర్థులు సతమతమవుతున్నారు. ఒక పరీక్ష కోసం మరో పరీక్షను వదులుకోవాల్సి ఉండటంతో కలవరపడుతున్నారు. గ్రూప్-2 పరీక్షలు డిసెంబర్ 15, 16న జరగనున్నాయి. ఆర్ఆర్బీ జూనియర్ ఇంజినీర్, టెక్నీషియన్ పోస్టుల భర్తీకి డిసెంబర్ 16, 17, 18న పరీక్షలు జరగనున్నాయి.
గ్రూప్-2కు హాజరయ్యే వారి లో కొందరు ఆర్ఆర్బీ పరీక్షలకు దరఖాస్తు చేశారు. దీంతో తమకు నష్టం కలుగుతుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఆర్ఆర్బీ పరీక్షలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తుండటంతో వాయిదావేయడం అసాధ్యం. దీంతో గ్రూప్-2 పరీక్షలను వాయిదావేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఏనిమిదేండ్ల తర్వాత జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి ఆర్ఆర్బీ నోటిఫికేషన్ విడుదలైందని, గ్రూప్-2 కూడా ఎన్నో ఏండ్ల తర్వాత విడుదలైందన్నారు.