చిక్కడపల్లి, డిసెంబర్ 30 : పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న రిసోర్స్పర్సన్ల(ఆర్పీ) 7 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని, కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్ డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఆర్పీల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద చేపట్టిన మహాధర్నాకు బీఆర్టీయూ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా రాంబాబుయాదవ్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి మహిళలను కోటీశ్వర్లు చేస్తామని చెప్పారని, కానీ కూటికి లేకుండా చేస్తున్నారనే విషయం ఆర్పీల పరిస్థితిని చూస్తే అర్థమవుతుందని విమర్శించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్పీలకు రూ.6 వేల వేతనం పెంచినట్టు గుర్తుచేశారు. సంఘం గౌరవాధ్యక్షుడు రూప్సింగ్ మాట్లాడుతూ.. ఆర్పీలు నిత్యం మహిళా సంఘాల బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కనీస వేతనాల సలహా మండలి మాజీ చైర్మన్ నారాయణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని మండిపడ్డారు. ఆర్పీలకు ట్రెజరీ ద్వారా వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్టీయూ ఉపాధ్యక్షుడు మారయ్య మాట్లాడుతూ.. ఆర్పీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. మానుకోట సునీత అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కంకణాల శ్రీమతి, కోశాధికారి ఎస్కే జహార, ఉపాధ్యక్షులు అనూరాధ, స్వర్ణలత, మంగాదేవి, పెద్దసంఖ్యలో ఆర్పీలు పాల్గొన్నారు.