వరంగల్, మే 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వరంగల్ నగరంలో ముఖ్యంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రౌడీలరాజ్యం నడుస్తున్నదనే విమర్శలొస్తున్నాయి. మంత్రి కొండా సురేఖ అనుచరుడైన ఒక మాజీ రౌడీషీటర్ ఆగడాలకు అడ్డూఅదుపులేకుండా పోతున్నదని చివరకు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు సైతం ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. భూదందాలు, పంచాయితీలు, అధికారిక కార్యక్రమాలు, అధికారులకు పోస్టింగులు అన్నీ మాజీ రౌడీషీటర్ కనుసన్నల్లోనే జరుగుతున్నట్టు తెలుస్తున్నది. ‘అన్నకు ఏజ్ బార్ అయ్యింది. హెల్త్ ఇబ్బంది పెడుతున్నది. అన్నీ చూసుకోవాలని నాకే చెప్పిండు. ఇప్పుడంతా నేనే. ఇక మనదే రాజ్యం’ అని సదరు మాజీ రౌడీషీటర్ చెప్పుకుంటూ దందాలు సాగిస్తున్నాడనే ఆరోపణలున్నాయి.
అధికారులు, ముఖ్యంగా పోలీసు అధికారులు సైతం మంత్రి సురేఖ కంటే మాజీ రౌడీషీటర్ మాటకే ఎక్కువ విలువ ఇస్తున్నారని, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పనిచేస్తున్న పోలీసు అధికారులు పొద్దునే మంత్రి అనుచరుడిని కలిసి సెల్యూట్ చేసిన తర్వాతే డ్యూటీకి వెళ్తున్నారనే విమర్శలున్నాయి. మాజీ రౌడీషీటర్‌తో చేతులు కలిపిన కొందరు పోలీసులు సామాన్యులపై జులుం ప్రదర్శిస్తున్నారని, వ్యాపారులు, ఇతరులను బెదిరించి వారి ఆస్తులను కొల్లగొడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇటీవల మంత్రి కొండా సురేఖ పుట్టినరోజు సందర్భంగా ఆమె అనుచరుడు, వరంగల్ ఏసీపీ, ఇంతెజార్గంజ్, మిల్స్‌కాలనీ ఇన్స్పెక్టర్లు కలిసి నడిరోడ్డుపై వేడుకలు నిర్వహించగా, పటాకులు పేలి ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రజల్లో వ్యతిరేకత రావడంతో మిల్స్‌కాలనీ ఇన్స్పెక్టర్ మల్లయ్యను బదిలీ చేశారు. ఇటీవల గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ మీటింగ్ జరిగే ప్రాంతానికి ఎలాంటి హోదా లేని మాజీ రౌడీషీటర్ వచ్చాడు. ఏసీపీ, ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఎదురుగా వెళ్లి సెల్యూట్ చేసి మరీ ఆయనను ఓ ప్రైవేటు రూములో కూర్చోబెట్టారు. ఈ వ్యవహారంపై అధికార పార్టీ కార్పొరేటర్లు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
మాజీ రౌడీషీటర్ నవీన్‌రాజ్ డ్యూటీలో ఉన్న ఒక పోలీసు అధికారిని బెదిరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. రెండురోజుల క్రితం వరంగల్‌లోని ఇస్లామియా జూనియర్ కాలేజీ మైదానంలో ఎగ్జిబిషన్ ప్రారంభ కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ వచ్చారు. మంత్రి కారు దిగి వేదిక వద్దకు వస్తున్న క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి వచ్చారు. బందోబస్తు డ్యూటీలో ఇన్స్పెక్టర్ సతీశ్ వారిని పక్కకు జరగాలని ఆదేశిస్తూ మంత్రిని ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే, మంత్రి పక్కనే ఉన్న మాజీ రౌడీషీటర్ నవీన్‌రాజ్ కలుగజేసుకుంటూ.. ‘ఎవరు నువ్వు.. నేనెవరో తెలుసా?’ అంటూ ఇన్స్పెక్టర్ సతీశ్‌ను బెదిరించడం, ఇన్స్పెక్టర్ సైతం అదే స్థాయిలో ‘నేనెవరో తెలుసా?’ అంటూ బదులిచ్చారు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది. వరంగల్‌లో రౌడీలు పెత్తనం చెలాయిస్తున్నారని, పోలీసులు వారికే సహకరిస్తున్నారని అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం సీఎంకు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ‘నగరంలో ఇప్పడున్న ఈ పరిణామాలు మా 30 ఏండ్ల రాజకీయం ఎప్పుడూ చూడలేదు. ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటే ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకముంటుందని’ ఒక ఎమ్మెల్సీ, ఒక ఎమ్మెల్యే సీఎం రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.