హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ) : రక్త, మూత్ర, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించే డయాగ్నస్టిక్ సెంటర్లకెళ్లేందుకు ప్రత్యేక విధానాన్ని ఐసీఎంఆర్ డెవలప్ చేస్తున్నది. ఇందులోభాగంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాథాలజీ.. న్యూఢిల్లీ డయాగ్నస్టిక్ సర్వీసెస్ ఇన్ హెల్త్ కేర్ (దిశ) అనే పోర్టల్‌ను రూపొందిస్తున్నది. అత్యవసరమైన వైద్య పరీక్షల సేవలను వేగంగా పొందేందుకు ఈ రూట్ మ్యాప్‌ను తీర్చిదిద్దుతున్నారు.
దేశంలోని ల్యా బరేటరీ సేవల లభ్యత జియో మ్యాపింగ్ సౌక ర్యం, రకం, దూరం, పరీక్షల లభ్యత, ఖర్చు ల వివరాలను www. icmrdisha.in ఈ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇది ప్రజారోగ్య రంగంలో కీలకంగా మారనున్నదని ఐసీఎంఆర్ శాస్త్రవేత్త డాక్టర్ ఉషా అగర్వాల్ తెలిపారు. డయాగ్నస్టిక్ సెంటర్లను సులభంగా చేరుకోవడమేగాక పరీక్షల సమగ్ర సమాచారం అందుబాటులో ఉంటుందని వివరించారు. అదేవిధంగా, అన్ని ప్రైవేటు, ప్రభుత్వ డయాగ్నస్టిక్ సేవల వివరాలను ఒకే వేదిక ద్వారా పొందవచ్చని ఐసీఎంఆర్ వర్గాలు పేర్కొంటున్నాయి.