హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబరు 17 (నమస్తే తెలంగాణ): ఇతర పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు సాంకేతిక వెసులుబాటు ప్రకారం వెళ్లే రింగు రోడ్డుకు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పూనకం వస్తుంది. అప్పటివరకు ఉన్న అలైన్మెంట్లు పాములు తిరిగినట్టుగా అటూ ఇటూ వంకర తిరుగుతాయి. ఇప్పుడూ అదే జరిగింది. రీజనల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) రూటు మారింది. దక్షిణ భాగంలో ఏకంగా నాలుగైదు కిలోమీటర్ల మేర రోడ్డు పెరిగింది. ఇటీవల ఓ కీలక నేత నివాసంలోనే ఈ మార్పునకు అధికారిక ముద్ర పడగా… తాము బహిరంగంగా ప్రకటించేవరకు సమాచారం బయటికి పొక్కొద్దంటూ ఆర్అండ్బీ అధికారులకు గట్టిగానే హెచ్చరికలు జారీ అయినట్టు తెలిసింది. పైకి ఫ్యూచర్ సిటీ కోసమేనంటూ నేతలు చెప్తున్నా.. వాస్తవం వేరే ఉన్నదని ప్రచారం జరుగుతున్నది. నానాటికీ విస్తరిస్తున్న హైదరాబాద్ మహా నగరం పరిధిలో అధునాతన రవాణా వ్యవస్థను మెరుగుపర్చేందుకు కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే రీజినల్ రింగురోడ్డుకు అంకురార్పణ జరిగింది.
కేంద్రప్రభుత్వ సహకారంతో అవుటర్ రింగు రోడ్డుకు అవతల 300 కిలోమీటర్లకు పైగా పొడవుతో ట్రిపుల్ ఆర్‌ను ప్రతిపాదించారు. ఈ మేరకు కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే ఉత్తర, దక్షిణ భాగాలకు సంబంధించిన అలైన్మెంట్ ప్రతిపాదనలు కూడా కేంద్రానికి వెళ్లాయి. అందులో భాగంగా తొలుత ఉత్తర భాగం సంగారెడ్డి (ఎన్‌హెచ్-65 మీదుగా) – తూప్రాన్ – గజ్వేల్ – చౌటుప్పల్ (ఎన్‌హెచ్-65 మీదుగా) వరకు 158 కిలోమీటర్ల మేర అలైన్మెంట్ నిర్ధారణ జరిగింది. ఈ ప్రక్రియ అంతా పారదర్శకంగా జరిగింది. ఎక్కడా ఆరోపణలుగానీ, అనుమానాలుగానీ రాలేదు. దక్షిణ భాగంలో అలైన్‌మెంట్‌కు సంబంధించిన ప్రాథమిక దశ కసరత్తు పూర్తయ్యింది.
ఆ మేరకు ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ మ్యాపునూ విడుదల చేశారు. అందులో దక్షిణభాగం వైపు ట్రిపుల్ ఆర్ ఎలా వెళ్తుందనే వివరాలు కూడా ఉన్నాయి. కాకపోతే దానిని అధికారికంగా సర్వే చేసి నిర్ధారించాల్సి ఉంది. ఈలోగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం వాస్తవానికి 189 కిలోమీటర్లుగా గతంలోనే నిర్ధారించారు. ఎన్‌హెచ్-65 మీదుగా చౌటుప్పల్ నుంచి షాద్‌నగర్- ఆమన్‌గల్ సమీపంలో నుంచి చేవెళ్ల మీదుగా సంగారెడ్డి వరకు రింగును కలపాల్సి ఉంది. గతంలో అధికారికంగా విడుదల చేసిన ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మ్యాపులోనూ ఇదేరీతిన అలైన్మెంట్ ఉన్నది. కానీ కొంతకాలం కిందటి నుంచి అలైన్మెంట్లో మార్పులపై ప్రభుత్వ పెద్దల స్థాయిలో అంతర్గతంగా తర్జనభర్జనలు జరిగినట్టు తెలిసింది. ఈ మేరకు ఏకంగా నాలుగు కిలోమీటర్ల మేర పొడిగింపుతో పలుచోట్ల అలైన్మెంట్లో మార్పులు చేశారు.