ఖైరతాబాద్, ఆగస్టు 9: కులగణనపై కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో ఓమాట, గల్లీలో ఓమాట మాట్లాడుతూ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని బీసీ నేతలు అభిప్రాయపడ్డారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్‌గౌడ్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్‌లో కాంగ్రెస్ నాయకులు.. తమ పార్టీ అధికారంలోకి రాగానే కులగణన చేపడుతామని, 42 శాతం రిజర్వేషన్లు అమలుచేసిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.
అధికారంలోకి రాగానే కులగణన ఏమైందని నిలదీశారు. ఓ వైపు ఢిల్లీలో రాహుల్‌గాంధీ కులగణన చేయాలని, రిజర్వేషన్లు పెంచాలని నినదిస్తుంటే, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి భిన్నంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాహుల్‌గాంధీ మాటలకు తెలంగాణ ప్రభుత్వం విలువ ఇవ్వడం లేదని పేర్కొన్నారు. బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాంయాదవ్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి బీసీలపై ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. బీసీలకు న్యాయం జరగాలంటే పోరాటమే ఏకైక మార్గమని స్పష్టంచేశారు. కులగణన, బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నేడు ఇందిపార్కు వద్ద బీసీల సత్యగ్రహ దీక్ష చేపడుతున్నామని, బీసీలు వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ప్రొఫెసర్ తిరుమలి, బత్తుల సిద్దేశ్వర్లు, ప్రభంజన్‌యాదవ్, సాంబశివగౌడ్, కట్టెకోల శ్రీహరిముదిరాజ్, అశోక్, మాధవి, శ్రీహరిముదిరాజ్, సురేశ్‌ముదిరాజ్, మహేశ్‌గౌడ్ పాల్గొన్నారు.